
తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం అమలవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తోంది ప్రభుత్వం. అయితే అనుకున్నట్లుగా కాకుండా దాదాపు 60 శాతం మంది పేదలకు ఈ పథకం వర్తిస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఫ్రీ కరెంట్ స్కీం బంద్ కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో వినియోగదారులు టెన్శన్ పడుతున్నారు.
ఫ్రీ కరెంట్ వినియోగదారుల్లో భయాందోళన నెలకొంది. వేసవికాలం మీటర్లు స్పీడ్‌గా తిరుగుతున్నాయని విద్యుత్ పంపిణీ సంస్థలకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ వేసవిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ చూపిస్తే గృహ జ్యోతికి దూరమవుతామనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. అయితే మూడు చిట్కాలు పాటిస్తే కరెంట్ వినియోగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. కరెంట్ బిల్లులపై సులభంగా అవగాహన కలిగేలా TGSPDCL తన వెబ్ సైట్‌లో కాలిక్యులేటర్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
బిల్లులు ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తే.. ఈ కాలిక్యులేటర్ సహాయంతో బిల్లులను వివరంగా చూసుకునే అవకాశముంది. గత, ప్రస్తుత నెలల బిల్లుల వివరాలను అందులో పొందుపరిస్తే బిల్లులను ఎలా లెక్కిస్తున్నారో ఇందులో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే 10 నుంచి 40 వాట్స్ ఉన్న ఎల్ ఈడీ బల్బులను అమర్చుకోవాలి. పాత ఫ్యాన్స్ స్థానంలో కొత్త టెక్నాలజీ, తక్కువ వాట్స్‌తో వస్తున్న ఫ్యాన్లను రీప్లేస్ చేసుకోవాలి. సాధారణ విండో లేదా స్ల్పిట్ ఏసీ ఉంటే వాటి స్థానంలో ఇన్వర్టర్ ఏసీలను ఇన్ స్టాల్ చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.