
జూలై నెలలోనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ మాసంలో ఆశించిన వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణాకు భారీగా వరద వస్తోంది. ఎగువన కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో వరద మొత్తం శ్రీశైలం డ్యాం చేరుతోంది. అటు జూరాల.. ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం డ్యాంలోకి 60 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఆదివారం శ్రీశైలం డ్యాం గేట్లు తెరుచుకోనున్నాయి.
కృష్ణ పరిహాక ప్రాజెక్టులైన ఆల్మట్టి,జూరాల, తుంగభద్ర ,శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు 60 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారు.
నాగార్జునసాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 521.30 అడుగులు గా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 151.6576 టీఎంసీలుగా ఉంది. ఐతే
తాగు నీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు సాగర్ ఎడమ నుండి 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలుపుతున్నారు. అలాగే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ కు తాగునీటికి ఇప్పటికే నీటి విడుదల కొనసాగుతోంది.