క్రైమ్తెలంగాణవైరల్

నల్లగొండ జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యచరణ-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

  • తరచూ దొంగతనాలకు పాల్పడుతూ, అలవాటైన నేరస్తులకు హెచ్చరిక
  • జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న, వాటికి అలవాటైన నేరస్తులపై, జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ హెచ్చరించారు.

 

జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులందరినీ, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో హాజరు పరచి, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో, నేరాలను మానుకొని, సమాజంలో గౌరవ ప్రదమైన, చట్టబద్ధమైన జీవితం గడపాలని వారికి సూచనలు ఇచ్చారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే, ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

 

తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులు, తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్), రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కింద అరెస్ట్ లు, రిమాండ్ వంటి చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కఠినంగా హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

 

అలాగే, దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై, ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం ఉంచాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఘటనలు కనిపిస్తే డయల్ 100 లేదా, సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.

 

జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారు సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని, ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలని, అలాంటి వారికి పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయ–సహకారాలు, అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button