
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని అయ్యపల్లి తండాలో ఓ కుమారుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడు దేవసూత్ ఫకీరా నాయక్ (47), అతని భార్య కొంతకాలం క్రితమే మృతిచెందింది. కుమార్తెకు పెళ్లి చేసిన ఫకీరాకు కుమారుడు ప్రశాంత్ కుటుంబంతో జీవిస్తున్నాడు.
శనివారం రాత్రి మద్యం సేవించి వచ్చిన ఫకీరా నాయక్, తనకు రెండో వివాహం చేయాలంటూ కొడుకుతో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదం తీవ్రమవడంతో గ్యాస్ సిలిండర్ పేల్చేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఈ క్రమంలో ప్రశాంత్ క్షణికావేశంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.