15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!

పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టే దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టే దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పదిహేనేళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా రూపొందించిన బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభలో సభ్యుల మద్దతు లభించింది. ఈ బిల్లుపై త్వరలో సెనెట్‌లో చర్చ జరగనుందని, అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు.

నేటి కాలంలో పిల్లలు చదువుకంటే ఎక్కువగా మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు చిన్నారులను గంటల తరబడి స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తున్నాయని, దీని వల్ల వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ఆన్‌లైన్ అలవాట్లు పెరగడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

దీర్ఘకాలం మొబైల్ స్క్రీన్‌ను చూస్తూ గడపడం వల్ల కంటిచూపు సమస్యలు పెరుగుతున్నాయని, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటి అనారోగ్య సమస్యలు చిన్నారుల్లో ఎక్కువవుతున్నాయని ఫ్రాన్స్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఎదిగే వయసులో పిల్లలపై పడే ఈ ప్రభావాలు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మాక్రాన్ తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలాఖరులోగా సెనెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆమోదం లభిస్తే సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా 15 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను తొలగించేందుకు సంబంధిత సంస్థలకు డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వనున్నారు.

కొత్త చట్టం అమల్లోకి వస్తే పాఠశాలల్లో కూడా పిల్లల మొబైల్ ఫోన్ వినియోగంపై కఠిన నిషేధం విధించనున్నారు. చదువుపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు పిల్లల్లో సామాజిక పరస్పర సంబంధాలు పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. డిజిటల్ ప్రపంచానికి పూర్తిగా దూరం చేయడం కాదు కానీ నియంత్రిత వినియోగం అలవాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఫ్రాన్స్ ఒంటరిగా లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించి అమలు చేస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం యూరప్ దేశాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇతర దేశాలు కూడా ఇదే తరహా చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చర్చల నడుమ ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం చిన్నారుల మానసిక ఆరోగ్యం, భవిష్యత్ తరాలకు రక్షణ కల్పించే కీలక అడుగుగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ALSO READ: విషాదం.. వర్క్ ఫ్రం హోం చేస్తుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button