క్రైమ్తెలంగాణ

Shocking Murder: భార్యను కొట్టి చంపి.. స్టేటస్‌గా పెట్టుకున్న భర్త

Shocking Murder: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త చివరకు మానవత్వం మరిచి కిరాతకంగా ఆమె ప్రాణాలు తీసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

Shocking Murder: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త చివరకు మానవత్వం మరిచి కిరాతకంగా ఆమె ప్రాణాలు తీసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సరస్వతి, వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన రొడ్డె ఆంజనేయులుతో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం ఆంజనేయులు కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ, హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.

గత కొంతకాలంగా భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. అదే అనుమానంతో సరస్వతిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తరచూ గొడవలు, దాడులు చేయడంతో విసిగిపోయిన సరస్వతి కొంతకాలం క్రితం తన తల్లి ఇంటికి వెళ్లి, భర్త పెడుతున్న బాధను కన్నీటితో కుటుంబ సభ్యులకు వివరించింది. పెద్దలు మధ్యలో జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో, సంక్రాంతి పండగ అనంతరం ఈ నెల 17న పిల్లలను తీసుకుని తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది.

అయితే అప్పటికే భార్యపై కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు ఆమెను ఎలాగైనా చంపేయాలన్న దురాలోచనతో ఉన్నాడు. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, ఇంట్లోనే ఉన్న రోకలిబండతో ఆమె తలపై, శరీరంపై విచక్షణలేకుండా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.

ఇంతటితో ఆగకుండా మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న నిందితుడు, ఆ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఉదయం నిద్రలేచిన పిల్లలు తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే మేనమామ ప్రశాంత్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మొదట నమ్మని ప్రశాంత్‌కు వీడియో కాల్ ద్వారా చూపించడంతో, అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

బోరబండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది.

ఇదిలా ఉండగా, ఆంజనేయులు గతంలో కూడా హింసాత్మక ప్రవర్తనకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. సరస్వతిని తరచూ కొడుతుండటంతో ఆమె తమ్ముడు ప్రశాంత్ నిలదీయగా, 2022లో అతడిపై కత్తితో దాడి చేసిన ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. అయినప్పటికీ మారని మనస్తత్వమే చివరకు ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Shocking Video: మారణహోమం.. 22 మందిని చంపిన ఏనుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button