
Shocking: యూరప్‌ను కుదిపేసిన అత్యంత విచిత్రమైన, భయానకమైన జన్యుపరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ ప్రమాదాన్ని అసాధారణంగా పెంచే అరుదైన జన్యు మ్యుటేషన్ తనకు ఉందన్న విషయం తెలియకుండా ఓ వ్యక్తి సంవత్సరాలుగా వీర్యదానం చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా వివిధ దేశాల్లో ఫెర్టిలిటీ చికిత్స తీసుకున్న మహిళలు ఆయన వీర్యాన్ని ఉపయోగించడంతో మొత్తం 197 మంది పిల్లలు జన్మించినట్టు తాజా అంతర్జాతీయ పరిశోధనల్లో బయటపడింది. ఈ విషయం బయటకు రావడంతో యూరప్‌లోని ఫెర్టిలిటీ రంగం, ఆరోగ్య నిపుణులు, వైద్య సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు మరింత కఠినతరం చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దాత వీర్యం ద్వారా పుట్టిన చిన్నారుల్లో ఇప్పటికే కొందరు క్యాన్సర్ బారిన పడి మరణించారని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ మ్యుటేషన్‌ను వారసత్వంగా పొందిన పిల్లల్లో 90 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో తీవ్రమైన క్యాన్సర్‌తో పోరాడాల్సి వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మ్యుటేషన్ ‘టి పీ 53’ అనే జన్యువు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ జన్యువు శరీరంలోని కణాలు క్యాన్సర్‌గా మారకుండా కాపాడే కీలక పనిని చేస్తుంది. కానీ దాత వీర్యంలో ఉన్న పెద్ద శాతం కణాలు ఈ జన్యువు మ్యుటేట్ కావడంతో ఆ ప్రమాదం పిల్లలకు వారసత్వంగా చేరింది.
పలు యూరోపియన్ దేశాల పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్లు కలిసి దీని మీద విస్తృత పరిశోధన జరిపి షాకింగ్ వివరాలను వెలుగులోకి తెచ్చారు. దాత 2005లో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి వీర్యం దానం చేస్తున్నాడు. 17 ఏళ్లుగా ఆయన వీర్యం పలు దేశాల్లోని ఫెర్టిలిటీ క్లినిక్‌లకు చేరింది. యూకేలో ఆయన వీర్యాన్ని నేరుగా అమ్మకాలు చేయకపోయినా.. డెన్మార్క్‌లో చికిత్స పొందిన బ్రిటిష్ మహిళలు కూడా అదే దాత వీర్యం ఉపయోగించడంతో సమస్య మరింత విస్తరించింది.
అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ మ్యుటేషన్ ‘లి ఫ్రామెనీ సిండ్రోమ్’గా పిలవబడే అరుదైన పరిస్థితిని సృష్టిస్తుంది. చిన్న చిన్న పిల్లలకే పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉండడంతో వారి జీవితాలు అత్యంత ప్రమాదంలో పడతాయి. పుట్టిన పిల్లల్లో కొందరికి ఇప్పటికే బ్రెయిన్ ట్యూమర్లు, లుకీమియా, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్లు గుర్తించారని యూరోపియన్ వైద్య నిపుణులు వెల్లడించారు. ఇదే దాత వీర్యం ద్వారా పుట్టిన పిల్లల్లో కనీసం 23 మందికి ఈ మ్యుటేషన్ ఉన్నట్టు జూన్‌లో విడుదలైన వైద్య నివేదికల్లో స్పష్టమైంది.
నిపుణులు చెప్పిన వివరాలు ఈ ఘటన భయానకతను మరింత పెంచుతున్నాయి. పుట్టిన పిల్లలకు ప్రతి సంవత్సరం ఎంఆర్ఐ స్కాన్లు, అల్ట్రాసౌండ్‌లు తప్పనిసరి. చిన్న వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు నిరంతరం భయాందోళనల్లో జీవించాల్సిన పరిస్థితి. అమ్మాయిలు పెద్దయ్యాక రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉండటంతో కొందరు రొమ్ములను తొలగించుకోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ తమ వంతు బాధ్యతగా నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ, ఈ దాతపై వెంటనే నిషేధం విధించామని తెలిపింది. అయితే జన్యు పరీక్షలు ఎంత కఠినతరం చేసినా, పుట్టకముందే జరిగిన మ్యుటేషన్‌ను గుర్తించడం చాలా క్లిష్టమని వారు చెప్పడం ఆందోళనలకు కారణమవుతోంది.
మొత్తం 14 దేశాల్లోని 67 ఫెర్టిలిటీ క్లినిక్‌లు ఈ దాత వీర్యాన్ని ఉపయోగించాయి. పలు దేశాల్లో వీర్య వినియోగంపై చట్టాలు ఉన్నప్పటికీ అవి అమల్లో ఉండకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు బెల్జియంలో ఒక దాత వీర్యాన్ని ఆరు కుటుంబాలు మాత్రమే ఉపయోగించాలి కానీ.. అక్కడ 38 మంది మహిళలు అదే వీర్యాన్ని ఉపయోగించి 53 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ఇదే పరిస్థితి అనేక దేశాల్లో కనిపించడం భవిష్యత్‌లో మరింత పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన అంతర్జాతీయ ఫర్టిలిటీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. వీర్యదాతలపై మరింత కఠినమైన జన్యు పరీక్షలు అవసరమా? దాతల వీర్య వినియోగంపై అంతర్జాతీయ చట్టాలు ఉండాలా? ఒక దాత వీర్యంతో పుట్టే పిల్లల సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా కఠినంగా పరిమితం చేయాలా? అనే ప్రశ్నలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. తాము పొందిన చికిత్స ప్రమాదకరమని తెలియకే తమ పిల్లల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిన పలు కుటుంబాలు ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. భవిష్యత్తులో మరికొంత మంది పిల్లలు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉండొచ్చని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను గురిచేస్తోంది.
ALSO READ: GOOD NEWS: ఇవాళ వీరికి భారీగా ధన లాభం





