
Shocking: బీహార్ రాష్ట్రంలో HIV వ్యాప్తి మరింత ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సీతామర్హి జిల్లాలో బయటపడుతున్న HIV బాధితుల సంఖ్య వైద్యరంగానికే షాక్ కలిగిస్తున్నాయి. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఏఆర్‌టీ కేంద్రంలో ఇటీవల నిర్వహించిన విస్తృత పరీక్షల్లో 7,400 మందికిపైగా HIV పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ బాధితుల్లో 400 మందికిపైగా చిన్నారులే ఉండటం. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు నేరుగా వైరస్ సంక్రమించడం ఈ ప్రాంతంలో ఎంత తీవ్ర సమస్యగా మారిందో ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
తాజాగా ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ స్పందిస్తూ.. ప్రతినెలా కనీసం 50 నుంచి 60 కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రజల్లో సందేహాలు, సురక్షిత వైద్య పద్ధతులపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణాలుగా గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 7,400 కేసుల్లో సుమారు 5,000 మంది నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, ప్రభుత్వం అందించే ఏఆర్‌టీ మందులను అధికారులు నిరంతరం పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు HIV బాధితులైతే, తల్లితనంతో పాటు గర్భకాలంలో, జననం అనంతరం శిశువుకు వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను ఈ ప్రమాదం నుంచి రక్షించవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. జిల్లాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలలో అవగాహన ప్రచారం, స్క్రీనింగ్ శిబిరాలు, యువతలో సురక్షిత జీవన విధానాలపై విద్య చాలా అవసరమని అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు.
ALSO READ: APPLY: 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల





