
Sexual Assault Case: కేరళ రాష్ట్రాన్ని సంవత్సరాలుగా కుదిపేసిన లైంగిక వేధింపుల కేసుకు చివరికి కోర్టు కీలక నిర్ణయం చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓ మలయాళ నటి అపహరణ, లైంగిక దాడి కేసులో ప్రముఖ నటుడు దిలీప్ పై వచ్చిన ఆరోపణలు ఏళ్ల తరబడి చర్చకు గురైనాయి. సినీ పరిశ్రమలో, మీడియా వేదికలపై, ప్రజల్లో, మహిళా సంఘాల్లో ఈ కేసు తీవ్ర స్పందన కలగజేసింది. ఎనిమిదేళ్లుగా సాగిన దర్యాప్తు, విచారణలు, అనేక ఆరోపణలు, వాదోపవాదాల మధ్య ఎర్నాకులం సెషన్స్ కోర్టు చివరకు తన తుది తీర్పు చెప్పింది.
2017లో మలయాళ సినిమాల ప్రముఖ నటి కిడ్నాప్ చేయబడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే దుండగులు దాడికి పాల్పడి, వీడియో తీసి, ఆమెను తీవ్రంగా వేధించారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన సినీ రంగం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేసు దర్యాప్తు సాగుతున్న సమయంలో అనేక మలుపులు తిరిగింది. ఈ దాడికి కుట్ర పన్నడంలో నటుడు దిలీప్‌కు పాత్ర ఉందని పోలీసులు ఆరోపించారు. దిలీప్ ఈ కేసులో అరెస్టయ్యాడని అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అతను కొంతకాలం రిమాండ్‌లో ఉండగా అనంతరం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత ఎనిమిదేళ్లు ఈ కేసు విచారణలోనే గడిచిపోయాయి. కొత్త ఆధారాలు, సాక్ష్యాలు, సాక్షుల ప్రకటనలు అన్నీ కోర్టు ఎదుట ఉంచబడ్డాయి. దిలీప్ నిర్దోషి అని, తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఎప్పటికప్పుడు తెలిపాడు. కానీ.. పోలీసులు అతన్ని ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంటూ బలమైన ఆధారాలు ఉన్నాయని వాదించారు.
అయితే, ఇవాళ ఎర్నాకులం కోర్టు వెలువరించిన తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. దిలీప్‌పై వచ్చిన ఆరోపణలను నిరూపించడానికి బలమైన, స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అతనితో పాటు మరో ఇద్దరిపై కూడా ఆరోపణలు రుజువు కాలేదని కోర్టు పేర్కొంది. అయితే, ఈ కేసులో పాల్గొన్న మరో ఆరుగురిని మాత్రం కోర్టు దోషిగా నిర్ధారించింది. తగిన ఆధారాలతోనే వారిని శిక్షార్హులుగా గుర్తించింది.
ALSO READ: Crime: కోర్టు ఆవరణలో మహిళపై గ్యాంగ్ రేప్





