
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- మోత్కూరు నుంచి పనకబండ, పుల్లాయిగూడెం, కూరెళ్ళ గ్రామాల మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ఆయా గ్రామాల సర్పంచులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాదగిరిగుట్ట డిపో అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు యాదగిరిగుట్ట డిపో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ రెడ్డిను కలిసి సమస్యను వివరించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు రోజూ ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, అదనపు ఖర్చుతో పాటు భద్రతాపరమైన సమస్యలు కూడా ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
Read also : ప్రజాస్వామ్య గొంతు నొక్కి ఉద్యమాన్ని ఆపలేరు : జేఏసీ
సర్పంచుల విజ్ఞప్తికి డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. సమ్మక్క, సారక్క జాతర అనంతరం అవసరమైన బస్సులను మళ్లీ రూట్‌లోకి తీసుకువచ్చి సర్వీసులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పనకబండ, పుల్లాయిగూడెం, కూరెళ్ళ, తుక్కపురం గ్రామాల సర్పంచులు రేణుక, రామలింగయ్య, ముత్తమ్మ, శ్రావణి పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు భాషబోయిన ఉప్పలయ్య, ఉప్పల మచ్చగిరి, భాషబోయిన బుగ్గయ్య, జిట్ట నాగరాజు, రమేష్ తదితరులు హాజరయ్యారు. బస్సు సర్వీసులు పునరుద్ధరించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
Read also : వామ్మో.. ఒక్కో ఉద్యోగానికి రూ.కోటి లంచం





