
-
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
-
రిజర్వేషన్ల అమలుకే రేవంత్ మొగ్గు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించినట్లు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ నిర్వహించిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చామన్నారు. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించామన్నారు పొంగులేటి. త్వరలోనే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని సవరిస్తామన్నారు.
కాగా, సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల సవరణ చట్టాన్ని కేంద్రానికి పంపి, అక్కడ నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది సందేహంగా మారింది.