
Russia Cancer Vaccine: ప్రాణాంతక క్యాన్సర్ నుంచి కాపాడే వ్యాక్సీన్ ను కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. కొవిడ్-19 టీకాల్లో ఉపయోగించిన మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్(MRNA) టెక్నాలజీ ఆధారంగా ఎంటెరోమిక్స్ అనే టీకాను తయారు చేసినట్లు వెల్లడించింది. ఈ టెక్నాలజీతో తయారైన తొలి క్యాన్సర్ టీకా ఇదే అని రష్యా ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఎంటెరోమిక్స్ టీకా నూటికి నూరు శాతం రిజల్ట్ చూపించినట్లు వెల్లడించింది. పెద్ద కణతులు గల రోగులు ఈ టీకాను తీసుకున్నపుడు, ఆ కణతుల పరిమాణం తగ్గడంతోపాటు క్యాన్సర్ నయం అయినట్లుతెలిపింది. ఈ మేరకు రష్యా టుడే కీలక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యాక్సీన్ కు సంబంధించి ఆదేశ హెల్త్ మినిస్ట్రీ అనుమతుల కోసం ఎదరుచూస్తున్నట్లు వెల్లడించింది. అనుమతులు రాకానే ఈ వ్యాక్సీన్ ను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్ కణాల నిర్మూలన
అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను నయం చేయడమే లక్ష్యంగా ఈ ఎంటెరోమిక్స్ టీకాను అభివృద్ధి చేశారు. ఇది కండరాలలోకి ఇచ్చే ఇంజెక్షన్. రష్యాలోని చాలా ఆంకాలజీ సెంటర్లలో ఇప్పటికే దీనిని క్లినికల్ గా ఉపయోగించారు. కీమోథెరపీ లేదా రేడియేషన్ విధానాల మాదిరిగా కాకుండా ఈ టీకాను ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఇవ్వవలసి ఉంటుంది. రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించినపుడు తీవ్రమైన దుష్ఫలితాలు కనిపించలేదు. ఈ టీకాను రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రిసెర్చ్ రేడియలాజికల్ సెంటర్, ఎంగెల్‌హర్డ్‌ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాలెక్యులార్ బయాలజీ అభివృద్ధి చేశాయి. ఎంటెరోమిక్స్ టీకా రోగి శరీరంలోని ట్యూమర్ మార్కర్స్ ను గుర్తించడంలో రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. ఆరోగ్యకరమైన కణాలు, చెడు కణాల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. అనంతరం చెడు కణాలపై దాడి చేసేలా చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.