రేపటి నుంచి RRB రైల్వే ఆన్‌లైన్ పరీక్షలు
దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముందస్తు సిద్ధతకు ఉపయోగపడేలా ఉచిత మాక్ టెస్టులను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రైల్వే జోన్లలోని అభ్యర్థులు ఈ మాక్ టెస్టులను ఎలాంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా రాయవచ్చు. దీనివల్ల పరీక్ష సరళి, ప్రశ్నల విధానం, టైం మేనేజ్‌మెంట్‌పై స్పష్టమైన అవగాహన పొందే అవకాశం కలుగుతుంది.
ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్షలు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అయి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మాక్ టెస్టులు అందుబాటులో ఉండటంతో చివరి నిమిషంలో కూడా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత బలపర్చుకునే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా మొదటిసారి రైల్వే పరీక్షలు రాసే వారికి ఈ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మంచి జీతభత్యాలు, స్థిరమైన భవిష్యత్ ఉండటంతో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పరీక్ష తేదీలు దగ్గరపడటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మాక్ టెస్టుల ద్వారా తమ బలాలు, బలహీనతలను గుర్తించి, అసలు పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం ఉండటంతో రైల్వే అభ్యర్థులు వీటిని పూర్తిగా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: మహిళతో ఎమ్మెల్యే రాసలీలలు.. బిగ్ షాక్!









