
కాంగ్రెస్ ప్రముఖ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఒక కీలక నోటీసును జారీ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. 1980-81లో న్యూ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరు చేర్చిన పద్ధతిపై గతంలో నమోదైన ఫిర్యాదును మ్యాజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివిజన్ పిటిషన్‌పై కోర్టు ఈ చర్య తీసుకుంది. ఆమె పౌరసత్వం పొందే ముందు ఎన్నికల జాబితాలో పేరు చేరడం చట్టపరంగా తప్పేనన్న ఆరోపణల నేపథ్యంలో జారీ చేసిన ఈ నోటీసు మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న మాత్రమే భారత పౌరసత్వం పొందినప్పటికీ, అంతకు ముందు 1980-81 సమయంలోనే ఆమె పేరు న్యూ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదు అయ్యిందని న్యాయవాది వికాస్ త్రిపాఠి ఆరోపించారు. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ అనేది పేర్కొన్న ఎన్నికల అర్హతల నిబంధనలను అతిక్రమించడం మాత్రమే కాకుండా, భారతీయ శిక్షాస్మృతి క్రింద కూడా శిక్షార్హమైన చర్యగా పరిగణించవచ్చని త్రిపాఠి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సెప్టెంబర్ 2025లో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి, ఆధారాలు సరిపోవని, చట్టపరంగా మరింత ముందుకు తీసుకెళ్లడం అవసరం లేదని నిర్ణయిస్తూ కేసును కొట్టివేసింది.
అయితే, ఈ తీర్పు సరైనదికాదని భావించిన త్రిపాఠి రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు జడ్జి విశాల్ గోగ్నే ఆ పిటిషన్ పై విచారణ చేపట్టారు. కోర్టు ఢిల్లీ పోలీసులను ఈ కేసుపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించడంతో పాటు, మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి మొత్తం రికార్డులు (TCR) సమర్పించాలని కూడా ఆదేశించింది. ఇదే సందర్భంలో సోనియా గాంధీకి ప్రతివాదిగా నోటీసులు జారీ చేస్తూ, పౌరసత్వం లేనప్పుడు ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా చేరిందో వివరించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ఈ నోటీసులు వెలువడడంతో కేసుపై ఆసక్తి మరింత పెరిగింది. కాంగ్రెస్ వర్గాలు దీన్ని రాజకీయ కుతంత్రంగా పేర్కొంటుండగా, ప్రత్యర్థి వర్గాలు ఇది చట్టపరమైన విచారణ మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నాయి. కోర్టు తదుపరి విచారణను 2026 జనవరి 6కు వాయిదా వేసింది. ఆ తేదీన ఢిల్లీ పోలీసులు సమర్పించే నివేదిక, సోనియా గాంధీ నుండి వచ్చే వివరణ, మ్యాజిస్ట్రేట్ రికార్డుల పరిశీలన ఇలా కీలక అంశాలన్నీ కేసు దిశను నిర్ణయించనున్నాయి.
ALSO READ: VIRAL NEWS: ‘కుంభ’గా రేవంత్ రెడ్డి పోస్టర్.. క్రియేటర్స్ అరెస్ట్





