
క్రైమ్ మిర్రర్ ఇన్వెస్టిగేషన్, నిజామాబాద్ బ్యూరో :- జిల్లాలో మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన రియాజ్ కేసుకు ఇవాళ ముగింపు లభించింది. కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ఈ ఉదయం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం… ఆదివారం రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాలతో ఉన్న అతన్ని ఎక్స్‌రే కోసం తరలిస్తుండగా, కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ పరిస్థితిలో పోలీసులు అప్రమత్తమై ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించాడు. మూడు రోజుల క్రితం రియాజ్ చేతిలో కానిస్టేబుల్ ప్రమోద్ దారుణంగా హత్యకు గురైన ఘటన అందరికీ గుర్తుంది. ప్రమోద్ తన అన్న కూతురి వైద్య చికిత్స కోసం వెళ్తున్న సమయంలో, రియాజ్ అక్కడికి రావడం జరిగింది. నిందితుడిని గుర్తించిన ప్రమోద్ తన మేనల్లుడి సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో రియాజ్ అకస్మాత్తుగా కత్తి తీసి ప్రమోద్ ఛాతీలో పొడిచి హతమార్చాడు. ఈ దాడిలో ప్రమోద్ మేనల్లుడు, ఎస్సై విఠల్ గాయపడ్డారు. హత్య అనంతరం రియాజ్ పరారయ్యాడు. పోలీసులు విభాగాల వారీగా టీమ్‌లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సారంగపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ లారీల మధ్య దాక్కున్నట్టు సమాచారం రావడంతో, పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో రియాజ్ ఒక యువకుడితో ఘర్షణ పడి గాయపడడంతో ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు.
Read also : బ్రేకింగ్ న్యూస్… ఎన్కౌంటర్ లో చనిపోయిన రియాజ్
ఈ ఉదయం ఆసుపత్రిలో ఎక్స్‌రే కోసం తీసుకెళ్తున్నప్పుడు రియాజ్ కానిస్టేబుల్ గన్ లాక్కొని దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరపాల్సి వచ్చింది. రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై రూమర్లు రాగా, రియాజ్‌ను అరెస్ట్ సమయంలో ఎన్‌కౌంటర్ చేశారనే వార్తలు తప్పుడు. అతను పారిపోవడానికి ప్రయత్నించగా తప్ప మేము కాల్పులు జరపలేదు, అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిన రియాజ్, అదే విధంగా పోలీసులు కాల్పుల్లో మరణించడంతో కేసు ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల ధైర్యాన్ని, చురుకుదనాన్ని పలువురు ప్రశంసిస్తుండగా, ఆసుపత్రిలోనే నిందితుడు ఎలా గన్ లాక్కోగలిగాడన్న అంశంపై కూడా చర్చ కొనసాగుతోంది.
Read also : దీపాల వెలుగులతో వెలిగిపోతున్న దేవాలయాలు..!