
తెలంగాణలో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు ముగియడంతో జిల్లాల వారీగా ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరుల్లో ఉత్సాహం చోటుచేసుకోగా, ఓడిన వారిలో మాత్రం నిరాశ, ఆవేదన, కోపం కలగలిసి కనిపిస్తోంది. ప్రచార సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా గెలుపు దక్కకపోవడంతో అనేక మంది అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన స్థానికులతో పాటు పోలీసులను కూడా అలర్ట్ చేసింది.
రఘునాథపాలెం మండలం హర్యా తండాకు చెందిన మాలోతు చింతామణి అనే మహిళ సర్పంచ్ పదవికి పోటీ చేసింది. ప్రచార సమయంలో ఆమె భర్త రంగా గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చింతామణి పరాజయం పాలవ్వడంతో రంగా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తాను ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతను నేరుగా గ్రామంలోని సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు.
సెల్ టవర్ పై నుంచి గ్రామస్థులను ఉద్దేశించి రంగా చేసిన వ్యాఖ్యలు గ్రామంలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఓట్ల కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే టవర్ పై నుంచే దూకి ప్రాణాలు తీసుకుంటానని బెదిరించాడు. అదీగాక హర్యా తండాకు చెందిన అనేకమంది పోలింగ్ రోజున శబరిమల యాత్రకు వెళ్లారని, కొందరు గ్రామంలో లేనేలేదని, అయితే వారి పేర్లపై ప్రత్యర్థి అభ్యర్థుల అనుచరులు రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని ఆరోపించాడు. తమ పరాజయానికి ఇదే కారణం అని రంగా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటన స్థానిక పోలీసులకు తెలియడంతో వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న రంగాను కిందకు దించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. తమ సమస్యలను శాంతిగా చెబితే పరిష్కారం చూపుతామని, ముందు టవర్ దిగాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తన డిమాండ్ నెరవేర్చకపోతే దిగేది లేదని రంగా మొండికేస్తూ ఉండటంతో హర్యా తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సెల్ టవర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో అతన్ని కిందకు దించడం పోలీసులకు సవాలుగా మారింది. పరిస్థితి నియంత్రణలోకి రావాలని, రంగా ఆత్మహత్యాయత్నం చేయకుండా ఆపాలని పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు టవర్ వద్ద పెద్ద సంఖ్యలో గ్రామస్థులు గుమిగూడడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
ALSO READ: IVFతో 90% జంటలు అప్పులపాలు





