
క్రైమ్ మిర్రర్, నల్లగొండ : చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, డీసీసీబీ డైరెక్టర్ జూలూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న జియో ట్యాగ్ నెంబర్లకు షరతులు విధించకుండా ప్రతి కార్మికునితోపాటు ఇద్దరు అనుబంధ కార్మికులను ఎంపిక చేయాలి అని కోరారు. అంతేకాకుండా, షరతులు లేకుండా చేనేత భరోసా పథకం ద్వారా కార్మికులందరికీ రూ.24 వేల నగదును అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే, చేనేత వృత్తిలో కొనసాగుతున్న వారికి కొత్త జియో ట్యాగ్ నెంబర్లు మంజూరు చేయాలని, సహకార సంఘాలకు రూ.40 కోట్ల లోపు ఉన్న క్యాష్ క్రెడిట్ నగదు మొత్తం పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. మరోవైపు, టెస్కో (TESSCO) ద్వారా చేనేత వస్త్రాలను నేరుగా కొనుగోలు చేసి, వాటిని కార్మికులకు పంపిణీ చేయడం ద్వారా మాస్టర్ వీవర్స్‌కు, చిన్నచిన్న సహకార సంఘాలకు పనిని కల్పించాలన్నారు. అదేవిధంగా, సహకార సంఘాలకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, చెరుకు జనార్ధన్, రాపోలు నరసింహ, వనం నరసింహ తదితరులు పాల్గొన్నారు.