క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం (46) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన నేడు (డిసెంబర్ 8, 2025) ఉదయం సాకేత్ కాలనీలోని ఒక పాఠశాల సమీపంలో నడిరోడ్డుపై జరిగింది.
ఇక వివరాలు ఇలా వున్నాయి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ, ఫోస్టర్ బిల్లాబాంగ్ స్కూల్ ముందు. వెంకటరత్నం తన పాపను పాఠశాలలో దింపి స్కూటీపై తిరిగి వెళ్తుండగా, దుండగులు అతన్ని వెంబడించారు.
మొదట తుపాకీతో కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. పాత కక్షలు లేదా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు వెంకటరత్నంపై గతంలో ధూల్‌పేట్‌లో డబుల్ మర్డర్ కేసుతో పాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..





