
ఎండలు దంచికొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 21, 22 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. దీంతో ఎండల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది.
తెలంగాణలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల,ఆదిలాబాద్,జగిత్యాల జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని సూచించారు.2024 వేసవితో పోల్చితే ఈ సారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మధ్యాహ్నం సమయాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని అంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ అధికంగా ఉంది. రానున్న వారం – పది రోజుల్లో మాత్రం కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.