
క్రైమ్ మిర్రర్, న్యూస్ ఏజెన్సీ : పట్టణం అంతా భక్తిరసంతో మునిగిపోయింది… శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అయ్యప్ప స్వామిని దర్శించుకొని, ఇరుముడిని సమర్పించారు. ఇది రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి అయ్యప్ప దేవాలయం సందర్శించిన మొట్టమొదటి ఘటనగా నిలిచింది.
కేరళ ప్రభుత్వ ఏర్పాట్ల మధ్య కఠిన భద్రతా నిబంధనలతో రాష్ట్రపతి శబరిమల సన్నిధికి చేరుకున్నారు. పన్నీర్‌తట్టం నుండి పాదయాత్ర రూపంలో మకరజ్యోతి మార్గాన్ని అనుసరిస్తూ స్వామి సన్నిధి చేరుకున్నారు. అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్పా నినాదాలతో రాష్ట్రపతి భక్తి భావంతో ఇరుముడి కట్టును సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం తంత్రులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి ముర్ము దర్శనం అనంతరం మాట్లాడుతూ అయ్యప్ప స్వామి అనుగ్రహం దేశ ప్రజలందరికీ లభించాలి. ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి మనసుకు ప్రశాంతి ఇస్తుంది అని పేర్కొన్నారు. భక్తుల మధ్య రాష్ట్రపతి దర్శనం విశేష ఆకర్షణగా నిలిచింది. ఆలయ పరిసరాలు భక్తుల సందోహంతో నిండిపోయాయి.