BRICS Presidency TO India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు షాక్ ఇచ్చే విషయం చెప్పారు. భారత్ కు ఆయిల్ సరఫరా, ఇంధన సహకారం విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. భారత్‌కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, పుతిన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. మోడీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరిందని చెప్పారు.
అన్ని రంగాల్లో భారత్ కు సాయం
భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందన్న పుతిన్, 100 బిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యం అన్నారు. ఇరుదేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయిల్ సహా అన్ని రంగాల్లో సహకారం అందిస్తామని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పర సహకారం ఉంటుందన్న ఆయన. సొంత కరెన్సీల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం జరుగుతోందని చెప్పారు. .అణువిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. విద్యుత్ రంగంలో ఖర్చు తగ్గింపునకు సాయం అందిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో భారత్‌తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు.
బ్రిక్స్ అధ్యక్ష పదవికి భారత్‌కు దక్కేలా సహకారం
భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వచ్చే ఏడాది భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందన్నారు. భారత్‌కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామన్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ప్రధాని మోడీ ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. యుద్ధం ఆపే ప్లాన్ గురించి తనకు వివరించి చెప్పారని పుతిన్ వివరించారు.





