
కోదాడ,క్రైమ్ మిర్రర్:- కొత్త సంవత్సరం వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించబడే విధంగా ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోదాడ సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున తెలియజేయడమైనది. గత అనుభవాల దృష్ట్యా, కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిద్రలేమి (Over-fatigue) లో డ్రైవింగ్ చేయడం, యువత గుంపులుగా తిరగడం, పబ్లిక్ రోడ్లపై స్టంట్లు చేయడం వలన ప్రాణాపాయ ప్రమాదాలు, శాంతి భద్రతలకు భంగం కలిగే సంఘటనలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని గమనించబడినది. అందువల్ల ప్రజలు, ముఖ్యంగా యువత మరియు తల్లిదండ్రులు, ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించవలసిందిగా సూచించడమైనది:
1.మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపరాదు.
2.నిద్రలేమి, అలసట లేదా మందుల ప్రభావంలో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయరాదు.
3.అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పూర్తిగా నిషేధం.
4.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, Four wheeler వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
5.18 సంవత్సరాల లోపు మైనర్లకు వాహనాలు అప్పగించరాదు. ఇందుకు తల్లిదండ్రులు/వాహన యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
6.పబ్లిక్ రోడ్లు, చౌరస్తాలు, ఫ్లైఓవర్లు, బస్టాండ్‌లు వంటి ప్రదేశాల్లో గుంపులుగా చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదు.
7.బైక్ రేసింగ్, వీల్ స్టంట్లు, ప్రమాదకర సెల్ఫీలు తీయడం పూర్తిగా నిషేధించబడినవి.
8.అశ్లీల ప్రవర్తన, ఈవ్ టీజింగ్, మహిళలు మరియు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సహించబడదు.
9.శబ్ద కాలుష్యం కలిగించే విధంగా అధిక సౌండ్ సిస్టమ్స్(D.J), పటాకులు వాడకూడదు.
10.సోషల్ మీడియా కోసం రెచ్చగొట్టే వీడియోలు, రీల్స్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టరాదు.
11.అనుమానాస్పద వ్యక్తులు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలు గమనించినచో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
12.అత్యవసర పరిస్థితుల్లో 100 / 112 నంబర్లను సంప్రదించవలెను.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ప్రత్యేక బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయబడినవి రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ ఉంటుంది* నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేయడమైనది. తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన పర్యవేక్షణ వహించి, వారు ప్రమాదకర పరిస్థితులకు గురికాకుండా చూడవలసిందిగా ప్రత్యేకంగా కోరడమైనది. ప్రజల సహకారంతోనే శాంతియుత సమాజం సాధ్యమని, కొత్త సంవత్సరం అందరికీ సురక్షితంగా మరియు ఆనందంగా ఉండాలని కోరడమైనది.





