
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నారని చౌటుప్పల్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఇన్స్‌పెక్టర్ జి. మన్మథ కుమార్ పర్యవేక్షణలో స్థానిక పోలీసులు పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం మాటువేసి సుమారు 102 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
భువనగిరి డీసీపీ ఎం. రాజేష్ చంద్ర చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నిఖిల్ కైలాస్ గైక్వాడ్ (36), అనే వ్యక్తి కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేవాడు. తాను సొంతంగా గంజాయిని వ్యాపారం చేస్తే నష్టాలు వస్తుండడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సేతు అనే వ్యాపారిని కలిసి గంజాయి వ్యాపారం గురించి వివరించాడు. కాంట్రాక్ట్ పద్ధతిన సేతుతో ఒప్పందం కుదుర్చుకొని గంజాయి రవాణా ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని నర్సీపట్నంనకు చెందిన వీరబాబు అనే వ్యక్తిని కలిసి 102 కిలోల గంజాయి కొనుగోలు చేసి మారుతీ కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు పథకం రచించాడు.
*కారు నెంబర్ ప్లేట్లను మారుస్తూ రవాణా*
అఖిల్ కైలాస్ గైక్వాడ్ తన తెలివిని ఉపయోగించి ఎక్కడా కూడా పోలీసుల కంటపడకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వరకు కారులోనే గంజాయిని తరలించడంలో ఆరితేరి పోయాడు. నర్సీపట్నంలోని వీరబాబు దగ్గరకు వెళ్లేటప్పుడు కారుకు ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న నెంబర్ ప్లేట్ ను బిగించుకొని వెళ్లి గంజాయి ఖరీదు చేయడం, అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటక వెళ్లేలోపు మార్గమధ్యలో కర్ణాటక నెంబర్ ప్లేట్ మార్చడం.. ఆ తరువాత మహారాష్ట్ర బోర్డర్ చేరుకునే లోపు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ బిగించుకుంటూ పోలీసులకు చిక్కకుండా గంజాయి వ్యాపారం చేయడం అలవాటుగా మారింది.
పక్కా సమాచారంతో పట్టివేత
విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మారుతీ కారులో మహారాష్ట్రకు గంజాయి రవాణా కొనసాగిస్తున్నారని చౌటుప్పల్ పోలీసులకు శనివారం సాయంత్రం పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన చౌటుప్పల్ పోలీసులు స్థానిక ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాటువేసి కూర్చున్నారు. ఏపీ నుంచి కారులో గంజాయి రవాణా చేస్తూ నిఖిల్ కైలాస్ గైక్వాడ్ పంతంగి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాడు. కారును తనిఖీ చేసి 51 ప్యాకెట్లలో ఉన్న 102 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి సెల్ ఫోను, మారుతీ కారు సీజ్ చేశామని డీసీపీ తెలిపారు.
*స్థానిక పోలీసులకు ప్రోత్సాహకాలు*
అత్యంత చాకచక్యంగా నిర్వహణ కొనసాగిస్తూ పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 100 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్న సందర్భంగా చౌటుప్పల్ పోలీసులను భువనగిరి డీసీపీ ఎం. రాజేష్ చంద్ర ఆదివారం అభినందించారు. ప్రోత్సాహక బహుమతిగా పారితోషికాన్ని అందజేశారు. విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి, చౌటుప్పల్ ఇన్స్‌పెక్టర్ జి. మన్మథ కుమార్, భూదాన్ పోచంపల్లి ఎస్ఐ ఎల్ భాస్కర్ రెడ్డి, చౌటుప్పల్ ఎస్ఐ లు కనకటి యాదగిరి, కృష్ణమల్ సురా, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, యాదవ రెడ్డి, భరద్వాజ్, సందీప్, పాపయ్య తదితరులు ఉన్నారు.