India–Brazil Strategic Partnership: బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. వచ్చే నెలలో లుల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తాజాగా మోడీ ఆయనతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం సుదృఢంగా సాగుతోందని, వచ్చే ఏడాది నూతన శిఖరాలను అధిరోహిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రెండు దేశాలూ ట్రంప్ టారిఫ్ ల బారిన పడడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
మూడు రోజుల పాటు బ్రెజిల్ అధ్యక్షుడు భారత పర్యటన
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా 2026 ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలపై చర్చిస్తారు. బ్రెజిల్-ఇండియా బిజినెస్ ఫోరమ్, న్యూఢిల్లీలో APEX ఆఫీస్ ప్రారంభం లాంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా వాణిజ్యం, బహుపాక్షిక వ్యవస్థలు, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఇరు దేశ సంబంధాల బలోపేతంపై చర్చలు
అటు భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, రక్షణ, టెక్నాలజీ, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో సహకారం పెంచడంపై దృష్టి సారిస్తారు. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా BRICS దేశాల ఉమ్మడి చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది. జూలై 2025లో ప్రధాని మోడీ బ్రెజిల్ పర్యటన తర్వాత ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేస్తుందని, ముఖ్యంగా వాణిజ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తుందని అంచనా.





