అంతర్జాతీయం

ప్రధాని మోడీ ఆహ్వానం.. త్వరలో భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు!

Zelenskyy India Visit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ, ఆ దిశగా కీలక అడుగులు వేస్తుంది భారత్. రష్యాతో శాశ్వత మిత్రత్వం కొనసాగిస్తున్న భారత్, ఉక్రెయిన్ తో కీలక చర్చలు జరిపేందుకు రెడీ అవుతోంది. త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించబోతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని భారత్ కు ఆహ్వానించారు ప్రధాని మోడీ. త్వరలోనే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

త్వరలో పర్యటన తేదీ ఖరారు

భారత్ కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ప్రధాని మోడీ ఆహ్వానించాని ఉక్రెయిన్‌ రాయబారి అలెగ్జాండర్‌ పొలిష్చుక్‌  వెల్లడించారు. ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, జెలె న్‌స్కీ రాక కోసం ఇరుదేశాల అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు.  “జెలెన్‌ స్కీ భారత్‌కు వస్తారని మేం ఆశిస్తున్నాం. మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక గొప్ప కార్యం కానుంది. తగిన తేదీకి ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం” అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించడంలో భారత్‌ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. రష్యాతో భారత్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా.. శాంతి చర్చల్లో భారత్‌ను కీలక పాత్రధారిగా తాము భావిస్తున్నామన్నారు. శాంతి, కాల్పుల విరమణను సమర్థిస్తున్న మోదీని ఆయన ప్రశంసించారు. భారత్‌ తటస్థమైనది కాదని, శాంతి, దౌత్యం, రాజకీయ చర్చలను అది దృఢంగా సమర్థిస్తోందని అన్నారు. కాగా ప్రధాని మోడీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరలో భారత్‌కు రాబోతున్నారు.

Back to top button