Homeతెలంగాణకొత్తవి రావు.. పాతవి పెరగవు..ఇదేమి పాలనరో దేవుడా..!

కొత్తవి రావు.. పాతవి పెరగవు..ఇదేమి పాలనరో దేవుడా..!

  • పెంచిన పెన్షన్ ల ఊసే లేదు, కొత్త దరఖాస్తుల ఆమోదం లేదు

  • తెలంగాణలో పెన్షన్ ల కోసం నిరుపేదల ఎదురుచూపులు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్య స్థాపనే ధ్యేయమని, ప్రకటించుకున్న ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో నిరుపేదలు, వృద్ధులు, వికలాంగుల పట్ల, అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.! ఎన్నికల వేళ ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో మాత్రం, పెన్షన్ పంపిణీని అటకెక్కించడం గమనార్హం. గత కొంతకాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ ల మంజూరు, ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో, వేలాదిమంది అర్హులు కార్యాలయాల చుట్టూ, కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది.

పెంచిన పెన్షన్ ల ఊసే లేదు, కొత్త దరఖాస్తుల ఆమోదం లేదు
పెంచిన పెన్షన్ ల ఊసే లేదు, కొత్త దరఖాస్తుల ఆమోదం లేదు

ఒకవైపు పెరుగుతున్న ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతుంటే, మరోవైపు వస్తున్న పింఛన్లను పెంచుతామన్న వాగ్దానం అటకెక్కింది. ప్రస్తుత అరకొర మొత్తంతోనే పూట గడవడమే కష్టతరంగా మారింది. భర్తలు చనిపోయి చివరికి వితంతువులు కూడా, చనిపోయే పరిస్థితి ఏర్పడిందని ప్రజలంటున్నారు..ముఖ్యంగా వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. సదరం సర్టిఫికేట్ల గడువు ముగిసిందన్న నెపంతో, వేలాది వికలాంగులకు పింఛన్లు నిలిపివేసింది.

తిరిగి వారు వైద్య పరీక్షలు చేయించుకుని, కొత్త సర్టిఫికేట్లు సమర్పించినా పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారు, తమ జీవనాధారం కోసం అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా, కనికరం చూపని పాలనా యంత్రాంగంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. సాంకేతిక కారణాలు, బడ్జెట్ సాకులు చూపుతూ, పేదల నోటికాడ బుక్కను దూరం చేయడం, ప్రభుత్వానికి తగునా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పెంచిన పెన్షన్ ల ఊసే లేదు, కొత్త దరఖాస్తుల ఆమోదం లేదు, ఉన్న పెన్షన్ పునరుద్ధరణలో చిక్కుముడులు వీడటం లేదని ప్రజలు వాపోతున్నారు.

అసలు ప్రభుత్వం దృష్టిలో సంక్షేమమంటే, కేవలం ప్రచారానికే పరిమితమా లేక నిజంగానే క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాలకు, అండగా నిలవడమా అనే అనుమానాలు వస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని, ఆగిపోయిన వికలాంగుల పింఛన్లను బకాయిలతో సహా చెల్లించాలని, తద్వారా రాష్ట్ర ప్రజల గోసను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పౌర సమాజం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. తక్షణమే స్పందించి ఈ సంక్షోభానికి చరమగీతం పాడకపోతే, పేదల ఆకలి మంటలు పాలకులకు హెచ్చరికగా మారుతాయనడంలో సందేహం లేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు