
ఆంధ్రప్రదేశ్ మంత్రిపదవిలో నాగబాబు చేరికపై డైలామా కొనసాగుతోంది. మంత్రి పదవి ఇవ్వడానికే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారనే చర్చ జరిగింది. కాని జనసేన ఎమ్మెల్సీ గా నాగబాబు గెలిచి ఆరు నెలలు అవుతున్నా ఆయనపై క్లారిటీ రావడం లేదు.అయితే సీఎం చంద్రబాబు ఆసక్తిగా ఉన్న నాగబాబు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే బ్రేకులు వేశారనే టాక్ వస్తోంది. ఇందుకు బలమైన కారణం కూడా ఉందంటున్నారు జనసేన నాయకులు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు మంత్రి పదవిపై గతంలోనే హామీ ఇచ్చారు. ముందుగా ఆయన్ని రాజ్యసభకు పంపుదామని అనుకున్నారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పటిదాకా నాగబాబు మంత్రి కాలేకపోయారు. ఇకమీదట నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారో లేదో అనే పరిస్థితి కనిపిస్తోంది..
వాస్తవానికి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. అప్పటికే కేబినెట్‌లో ఒక ఖాళీ కూడా ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ప్రకటన చేశారనే అభిప్రాయాలున్నాయి. కానీ నాగబాబును కేబినెట్‌లోకి తీసుకునే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెండింగ్ పెట్టారని అంటున్నారు. జనసేన ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే చర్చ బాగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. నాగబాబును కూడా కేబినెట్‌లోకి తీసుకుంటే… అదే సామాజికవర్గం అన్న ముద్ర పడుతుంది. ఇది జనంలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుందేమోనని పవన్ కల్యాణ్ తటపటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కారణంతోనే నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవడం అనుమానంగా మారింది.
నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంలో పవన్ కళ్యాణ్ కు మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. నాగబాబు సేవలను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. నాగబాబును పార్టీలో యాక్టివ్‌గా ఉంచడంతోపాటు, ఆయనతో జిల్లా పర్యటనలు చేయించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. మంత్రి పదవి ఇస్తే రెండిటికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు. అటు సినిమా షూటింగ్‌ల హడావుడి కూడా నడుస్తోంది. కాబట్టి పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. దీంతో నాగబాబును పార్టీ కోసం ఎక్కువగా ఉపయోగించుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నారని అంటున్నారు.