
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్… జనసేనను కంగారు పెడుతున్నారా…! అధినేత అభిమానుల తీరు.. పార్టీలో గందరగోళం సృష్టిస్తోందా..! ఇంతకీ.. అంతలా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు. పార్టీ నేతలు ఎందుకంత గాబరా పడుతున్నారు. జనసేన నేతలు, పవన్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రచ్చ ఏంటి…?
కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ చిత్రవిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పవన్ కళ్యాణ్ అభిమానుల పోరు.. జనసేన నేతలను ఇరుకున పెట్టేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ బర్త్‌డే సందర్భంగా… ఆయన అభిమానులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కోనసీమ.. అక్కడ కుల గొడవలు ఎక్కువ. గతంలో… పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. ప్రజాప్రతినిధుల ఇళ్లనే తగలబెట్టేశారు ఓ వర్గం వారు. అలాంటి సున్నితమైన ప్రాంతంలో… పవన్ కళ్యాణ్ అభిమానులు తీరు ఉద్రిక్తతకు కారణంగా మారుతోంది. అప్పన్నపల్లి, ఆలమూరు, కొత్తపేట ప్రాంతాల్లో.. పవన్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్… ఓ వర్గాన్ని కించపరుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాదు.. కోనసీమను.. కళ్యాణ్ సీమ అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. దీనిపై అక్కడి దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులు… మళ్లీ కులల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలజడి సృష్టించాలని చూస్తున్నారని దళిత నేతలు మండిపడుతున్నారు. జనసేన నేతల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. పవన్ ఫ్యాన్స్ తీరు వల్ల జిల్లాలో గొడవలు జరిగితే.. చెడ్డపేరు పవన్ కళ్యాణ్‌కు, జనసేనకే వస్తుందన్న భయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో… అభిమానుల తీరును తప్పుబడుతున్నారు కోమసీమ జిల్లా జనసేన నేతలు. దీంతో.. పార్టీ నేతలు, పవన్ అభిమానుల మధ్య వివాదం మొదలైంది.
Read Also : పండుగలు వస్తే చార్జీలు పెంచడమే.. ఇదేం ప్రభుత్వం : హరీష్ రావు
జనసేన నేతల తీరుపై.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల మహేష్‌బాబు అభిమానులు బాబు సీమ అని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. అలాంటప్పుడు… తాము కళ్యాణ్ సీమ అని పెట్టుకుంటే తప్పేంటని వారు పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే వచ్చింది తంటా అంతా… మహేష్‌బాబు రాజకీయాల్లో లేరు. ఆయన అభిమానులు… ఎలాంటి పోస్టర్లు పెట్టుకున్నా… అభిమానులు పెట్టుకున్నారని లైట్ తీసుకుంటారు. కానీ.. పవన్ కళ్యాణ్ విషయంలో అలా ఉండదు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు. జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గానీ, ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు గానీ… ఏ పని చేసినా.. అది పవన్ కళ్యాణ్‌కి వర్తిస్తుంది. అందుకే… సున్నితమైన ప్రాంతమైన కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ చేసిన పనిని జనసేన నేతలు తప్పుడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులుగా తాము చేసిన పని కరెక్టే అని ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారు. పైగా.. కావాలనే.. జనసేన నేతలు రాద్దాంతం చేస్తున్నారని.. సర్దిచెప్పాల్సింది పోయి… వివాదంగా మారుస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.
Also Read : అద్భుతంగా తిరుపతి బస్ స్టేషన్ ను నిర్మించాలి : సీఎం చంద్రబాబు
ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చేసిన రగడ అంతా ఇంతా కాదన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. భారీ డీజే సౌండ్లు, సైలెన్సర్లు లేని బైకులతో ర్యాలీలు తీశారు. దీంతో.. చాలా చోట్ల గొడవలు కూడా జరిగాయి. కొన్నిచోట్ల జనసేన నేతలే అభిమానులపై కేసులు పెట్టారు. దీంతో… జిల్లాలో నేతలు అభిమానుల మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఇలానే కొనసాగితే.. జిల్లాలో పార్టీకి కూడా నష్టం జరుగుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. నేతలు, అభిమానుల మధ్య గొడవలు సర్దుకోకపోతే.. జిల్లాలో పార్టీకి కష్టాలు తప్పవని కంగారు పడుతున్నారట. ఈ సమస్యకు ఎలా ఫుల్‌స్టాప్ పెట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట జనసేన సీనియర్లు.