
Heavy Rains In North: భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచ్ ప్రదేశ్ భారీ వర్షాలకు అల్లాడుతోంది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండి ప్రాంతంలో బీభత్సకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సిమ్లా- సున్నీ- కర్సోగ్ హైవే నదిని తలపించింది. హిమాచల్ ప్రదేశ్ అంతటా కుండపోత వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలు సంభవించాయి.
విరిగిపడ్డ కొండచరియలు, రాకపోకలు బంద్
చాలా ప్రాంతాల్లో రహదారుల మీద కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కర్సోగ్ డివిజన్‌లో రాత్రి సంభవించిన భారీ వర్షాల కారణంగా పలువురు గల్లంతు అయినట్లు స్థానికులు వెల్లడించారు. ఆకస్మిక వరదలతో అనేక ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 41మందిని సహాయక బృందాలు కాపాడాయి. కుక్లాలో వరదల కారణంగా 10 ఇళ్లు, ఒక వంతెన కొట్టుకుపోయాయి. మండి జిల్లాలో పాటికారి జల విద్యుత్ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. పండూ డ్యామ్ గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. బియాస్ నది ప్రమాదకస్థాయిలో ప్రవహిస్తోంది.
పాఠశాలలకు సెలవులు
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత 10 రోజులుగా కురుస్తున్న వానలు, ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంత మంది చనిపోయారనే అంశంపై క్లారిటీ లేదు. రహదారులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో భారీ వర్షాలు