అంతర్జాతీయం

భారత్‌ దాడిలో నూర్‌ ఖాన్‌ బేస్‌ ధ్వంసం, మళ్లీ నిర్మిస్తున్న పాక్!

Nur Khan Base: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో  పాక్‌ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్ వైమానిక దాడుల్లో దాయాది దేశానికి చెందిన కీలక ఎయిర్‌ బేస్‌ లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌ లో దెబ్బతిన్న ఆ ఎయిర్‌ బేస్‌ లను పాక్‌ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ లో భాగంగా భారత సైన్యం జరిపిన దాడుల్లో నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌ పూర్తిగా ధ్వంసం అయ్యింది. దాయాది దేశం ఇప్పుడు అక్కడ పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు బయటకు వచ్చాయి. పాక్‌ సైన్యం హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్న రావల్పిండిలో ఈ ఎయిర్‌ బేస్‌ ఉంది. అంతేకాదు దేశ రాజధాని ఇస్లామాబాద్‌ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఈ ఎయిర్‌ బేస్‌ రాజకీయంగా, సైనిక పరంగా ఎంతో సున్నితమైనదిగా చెప్తారు. అన్ని ఎయిర్‌ఫోర్స్‌ ఆపరేషన్లకు ఈ వైమానిక స్థావరమే కేంద్రం. ప్రధాని సహా వీఐపీల ప్రైవేట్‌ జెట్లు ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే 7న  మెరుపు దాడులు చేసింది. భారత్‌ దాడిలో ఉగ్రస్థావరాలు నేలమట్టమయ్యాయి. ఎప్పటినుంచో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌.. ఈ చర్యతో రగిలిపోయింది. భారత్‌ను దొంగదెబ్బ తీయడానికి సరిహద్దు ప్రాంతాలపై కాల్పులు, దాడులకు తెగబడింది. బారాముల్లా నుంచి భుజ్‌ వరకు 26 ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, జనావాసాలపై వరుసగా డ్రోన్‌ దాడులకు పాల్పడింది. సరిహద్దుల్లో శతఘ్నులతో విరుచుకుపడింది. దీంతో పాక్‌ దాడులను తిప్పికొట్టిన భారత త్రివిధ దళాలు.. దాయాది దేశంలోని పలు వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులను ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇస్లామాబాద్‌, రావల్పిండి, కరాచీతో పాటు దక్షిణ పంజాబ్‌, లాహోర్‌, సియాల్‌కోట్‌కు సమీపంలోని దాదాపు ఎనిమిది పాక్‌ ఎయిర్‌ బేస్‌ లు దెబ్బతిన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button