HomeతెలంగాణPadi Kaushik Redd: కేటీఆర్ మెప్పుకోసం.. పాడి కౌశిక్ రెడ్డి పాకులాట!

Padi Kaushik Redd: కేటీఆర్ మెప్పుకోసం.. పాడి కౌశిక్ రెడ్డి పాకులాట!

* సీనియర్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు

* గులాబీ పార్టీకి నష్టం అంటున్న విశ్లేషకులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఆయన తరచూ నేతలపై విరుచుకుపడుతుండడం అంతిమంగా గులాబీ పార్టీకే నష్టం అన్న కామెంట్స్ ఉన్నాయి. గతంలో అరికెపూడి గాంధీ ఇంటి మీదకు వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి సీనియారిటీని కూడా చూడకుండా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు.  రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజం. కానీ కౌశిక్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అందుకు భిన్నంగా ఉంది. అసలు తనకు సంబంధం లేని నేతలను ఆయన టార్గెట్ చేసుకుంటున్న తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. కేటీఆర్ మెప్పు పొందేందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేటీఆర్ కౌశిక్ రెడ్డిని ఎగదోస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు అనేది తెలంగాణ పొలిటికల్ విశ్లేషకుల వాదన.

అప్పట్లో గాంధీతో అలా..

అప్పట్లో అరికెపూడి గాంధీతో కానీ.. ఇప్పుడు కడియం శ్రీహరి తో కానీ పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన కనీసం ఆ జిల్లా వారు కూడా కాదు. తనకు సంబంధం లేని ఇతర జిల్లాల నేతలు పై టార్గెట్ చేయడం, వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఒక ప్రజాప్రతినిధిగా సభలో వాడకూడని భాషను వాడటం, సీనియారిటీకి కనీస మర్యాద ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇమేజ్ పక్కన పెడితే.. శాసనసభ గౌరవం దెబ్బతింటోంది. కేవలం కేటీఆర్ మెప్పు పొందేందుకు కౌశిక్ రెడ్డి ఇలా చేస్తున్నారు. కేటీఆర్ కూడా ఆయనను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు ఇది వికటించేందుకు అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటువంటి సంస్కృతిని ఇప్పుడే అడ్డుకట్ట వెయ్యకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ కుస్తీ పోటీలకు, భౌతిక దాడులకు వేదికగా మారే ప్రమాదం ఉంది.

దూకుడు అన్నివేళలా మంచిది కాదు..

రాజకీయాల్లో దూకుడు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో.. అంతలా ప్రతికూలతలు కూడా చూపించగలదు. ఆది నుంచి కౌశిక్ రెడ్డి ప్రవర్తన అలానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో చేరిన తర్వాత ఆయన ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెప్పు పొందాలని తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికి.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఫైర్ బ్రాండ్ అనిపించుకోవడానికి ఆయన ఉద్దేశపూర్వకంగానే వివాదాలను కొని తెచ్చుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఇలాంటి ప్రవర్తనను కేటీఆర్ గట్టిగా అడ్డుకట్ట వేయాలి. కానీ సమర్థించినట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో దూకుడు అవసరం కానీ.. అది రాజకీయ ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి వీలుగా ఉండాలి. అసహ్యం కలిగించే ఉండకూడదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే కనిపిస్తోంది.

ఏపీ నుంచి గుణపాఠాలు

ఏపీలో ఇదే మాదిరిగా వివాదాస్పద నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంపముంచారు. బూతులతో నేతలు రెచ్చిపోయేవారు. అధినేత జగన్మోహన్ రెడ్డి వారించే వారు. ఈ క్రమంలో అటువంటి నేతలతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మిత్రుడు. అటువంటి మిత్రుడికి ఎదురైన పరిణామాలను గుణపాఠాలుగా నేర్వకుంటే ఎలా? ఏ పార్టీకైనా ఇలాంటి వివాదాస్పద నేతల మాటలు మంచిగా అనిపించవచ్చు. కానీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఏది ఎలా ఉన్నా గులాబీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా గుర్తింపు ఉంది. అటువంటి పార్టీలో కౌశిక్ రెడ్డి చేస్తున్న అతి ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వివాదాలు అసలు చర్చను పక్కదారి పట్టించి పార్టీకి కోలుకోలేని నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది. తన దూకుడును పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూస్తే బాగుంటుంది. కానీ ఆయన వ్యక్తిగత దాడిని అలవర్చుకున్నారు. అది ఎంత మాత్రం సహేతుకం కాదు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments