తెలంగాణ

తెలంగాణలో మార్వాడీల వ్యాపారాలపై వ్యతిరేక ఆందోళనలు తీవ్రం

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణలో ఇటీవల మార్వాడీ వ్యాపారులపై వ్యతిరేకత పెరుగుతోంది. స్థానిక వ్యాపారులు తమ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్త్ ఇండియా నుంచి తెలంగాణకు వచ్చి మార్వాడీలు అన్ని రంగాలలోకి ప్రవేశించారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రిటైల్ దుకాణాలు, ఫైనాన్స్ రంగంలో కూడా వారి ఆధిపత్యం పెరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా, వారు తమ మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండడంతో, స్థానికులకు ఉపాధి లభించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో స్థానిక వ్యాపారులు ఆగస్టు 18న బంద్‌కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, ఈ నిరసన ద్వారా ప్రభుత్వం తమ సమస్యలను గమనించాలన్నదే వారి లక్ష్యం.

 కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు

ఈ వివాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాదులో జరిగిన తిరంగా ర్యాలీలో మాట్లాడుతూ, “మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముంది.? రాష్ట్ర జిడిపి పెంపులో వారి పాత్ర ఉంది. కానీ హిందూ వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారు ఆక్రమిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. అలాగే రోహింగ్యల గో బ్యాక్ ఉద్యమాన్ని కూడా చేపడతాం” అని హెచ్చరించారు.

స్థానిక వ్యాపారులు బయటి వ్యాపారుల మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్రంలో సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “మార్వాడీ గో బ్యాక్” నినాదం వర్గవివాదాలకు దారితీసే ప్రమాదం ఉందని, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button