
OLX: ఓఎల్‌ఎక్స్‌లో ఇటీవల వెలుగుచూసిన ఒక విచిత్రమైన ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద హంగామా రేపింది. సాధారణంగా వాడిన వస్తువులు, గాడ్జెట్లు లేదా వ్యక్తిగత ఆస్తులను అమ్మడానికి ఉపయోగించే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక వ్యక్తి నేరుగా ప్రభుత్వ భవనాన్నే అమ్మకానికి పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని కేవలం రూ.20 వేలకే విక్రయిస్తానంటూ ఒక ఆకతాయి పోస్టు చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయి ప్రజల దృష్టిని ఆకర్షించింది. పోస్టులో ఇచ్చిన ఫోటోలు, వివరాలు నిజమైనవిగా కనిపించడంతో మరింత గందరగోళం నెలకొంది.
ఈ ఘటన గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి చేరడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ప్రభుత్వ ఆస్తులపై తప్పుడు ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి తీవ్ర నేరాలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టు చేసిన ఆకతాయిని గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ALSO READ: Telangana: స్థానిక సంస్థల ఎన్నికలు.. కేబినెట్ కీలక నిర్ణయం





