Friday, March 13, 2026
Homeఅంతర్జాతీయంHormuz Tension: కల్లోల హోర్ముజ్ జలసంధి దాటి ముంబైకి చేరిన భారీ చమురు నౌక.. ఎలా...

Hormuz Tension: కల్లోల హోర్ముజ్ జలసంధి దాటి ముంబైకి చేరిన భారీ చమురు నౌక.. ఎలా వచ్చిందంటే?

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించి ముడి చమురుతో కూడిన ఓ భారీ నౌక ముంబై తీరానికి చేరుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆ మార్గం ద్వారా భారత్‌కు చేరుకున్న తొలి చమురు నౌక ఇదే కావడం విశేషం. లైబీరియా జెండాతో నడిచే ఈ నౌక పేరు షెన్‌లాంగ్ సూయెజ్ మ్యాక్స్. ఇందులో సుమారు 1,35,335 టన్నుల ముడి చమురు ఉంది. నౌక కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు భారతీయుడు కాగా, భారత్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన మొత్తం 29 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు.

మార్చి 1న బయల్దేరిన క్రూడ్ ఆయిల్ నౌక

ఈ నౌక మార్చి 1న సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టులో చమురును లోడ్ చేసుకుని మార్చి 3న భారత్ వైపు ప్రయాణం ప్రారంభించింది. మార్చి 8 వరకు ట్రాకింగ్ సిస్టమ్‌లలో కనిపించిన ఈ నౌక ఆ తర్వాత కొంతసేపు ట్రాకింగ్‌కు అందకుండా పోయింది. ఆ ప్రాంతంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో, రాడార్‌కు చిక్కకుండా ఉండేందుకు నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను తాత్కాలికంగా ఆఫ్ చేసి ‘డార్క్ మోడ్’లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన ప్రాంతాన్ని దాటిన తర్వాత మార్చి 9న మళ్లీ AISను ఆన్ చేయడంతో నౌక మళ్లీ ట్రాకింగ్ సిస్టమ్‌లకు కనిపించడం ప్రారంభమైంది.

చివరకు బుధవారం మధ్యాహ్నం ముంబై పోర్టుకు చేరుకున్న ఈ నౌక సాయంత్రం జవహర్ ద్వీప్ వద్ద లంగరు వేసింది. మరోవైపు, త్వరలో మరో భారీ చమురు నౌక కూడా భారత తీరానికి చేరే అవకాశం ఉందని సమాచారం. భారత జాతీయ పతాకంతో నడిచే ఆ వీఎల్‌సీసీ నౌకలో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల ఇరాకీ చమురు ఉందని, అది ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇరాన్ తో భారత్ చర్చలు

ఇదిలా ఉంటే హోర్ముజ్ జలసంధి గుండా అనుమతి లేకుండా వెళ్లే నౌకలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్–ఇరాన్ మధ్య చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే, దీనిపై పూర్తి వివరాలు వెల్లడించడానికి ఇంకా సమయం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హోర్ముజ్ ప్రాంతంలో భారత్‌కు చెందిన 28 నౌకలు చిక్కుకుపోయినట్లు షిప్పింగ్ శాఖ తెలిపింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments