క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) భారత్ రాష్ట్ర సమితి (BRS) నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. నేడు జనవరి 27, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది.
సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. కేసులోని కొన్ని వాస్తవాలు సంతోష్ కుమార్‌కు తెలిసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే చట్టం పట్ల తనకు గౌరవం ఉందని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రావు ఈ నోటీసులను ఖండించారు. సింగరేణి టెండర్ల కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వారు ఆరోపించారు.
ప్రాథమికంగా పంపిన నోటీసులో సంతోష్ కుమార్‌ను ప్రస్తుత ఎంపీ గా పేర్కొన్నారు. అయితే అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఆయన మాజీ ఎంపీ అని సిట్ అధికారులు తర్వాత స్పష్టం చేశారు. ఇప్పటికే ఇదే కేసులో భాగంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.





