Homeఅంతర్జాతీయంDalai Lama: ఎప్‌స్టీన్‌ తో సంబంధాలు.. దలైలామా కీలక ప్రకటన!

Dalai Lama: ఎప్‌స్టీన్‌ తో సంబంధాలు.. దలైలామా కీలక ప్రకటన!

Dalai Lama Jeffery Epstein Link: లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ తో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా  కు సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఎప్‌స్టీన్‌ను దలైలామా ఎప్పుడూ కలవలేదని, ఆయన తరఫున మరెవరూ కూడా ఎప్‌స్టీన్‌తో సమావేశమయ్యేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపింది.

అమెరికాలో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ సంచలనం

‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లోని వివరాలు బహిర్గతం కావడం అమెరికాలో సంచలనమవుతోంది. పిల్లల లైంగిక వేధింపుల నిందితుడు, సీరియల్ రేపిస్ట్‌ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయంటూ వివిధ దేశాల్లోని పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు బహిర్గతమవుతున్నాయి. ఈ క్రమంలో దలైలామా పేరూ ప్రస్తావనకు రావడంతో ఆయన కార్యాలయం వెంటనే ఖండించింది. ఎప్‌స్టీన్‌ను దలైలామా కలవడం కానీ, మరొకరిని కలుసుకునేందుకు అనుమతించడం కానీ ఎప్పుడూ జరగలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో బిగ్ షాట్స్..

అమెరికా డిపార్ట్‌ మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన 30 లక్షలకు పైగా ఫైళ్లు విడుదల చేసింది. అందులో 2,000కు పైగా వీడియోలు, సుమారు లక్షా ఎనభై వేల ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి పలువురి పేర్లు కూడా ఉన్నాయి. పేరు ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ పేర్లలో దలైలామా పేరు కూడా ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఇంతకీ ఎవరీ ఎప్‌స్టీన్?

జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాకు చెందిన ఫైనాన్షియర్. లైంగిక నేరాల దోషి. పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజిమెంట్ ద్వారా భారీగా సంపద కూడబెట్టాడు. హై ప్రొఫైల్ క్లయింట్లకు పని చేసేవాడు. బాలికలు, యువతులపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా కేసుల్లో దోషిగా తేలడంతో 2008లో ఫ్లోరిడాలో తొలిసారి ఆయన జైలుకు వెళ్లాడు. 2019లో ఫెడరల్ దర్యాప్తులో తిరిగి అరెస్టయ్యాడు. విచారణలో ఉండగానే జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments