
High Court: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నివేదిక, విజిలెన్స్ నివేదిక, ఇతర అంశాల ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు, తాము సీబీఐ ద ర్యాప్తు కోరడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐను స్వతంత్రంగా మొత్తం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయాలని కోరామని వెల్లడించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ దర్యాప్తు ఉండబోదని స్పష్టం చేసింది. ఘోష్ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చించామని, అయితే నివేదిక ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపింది. చర్యలు తీసుకుంటే అందుకు సంబంధించిన చర్యా నివేదికను శాసనసభలో పెడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై వాడీ వేడీ వాదలను
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులోవాడీవేడిగా వాదనలు జరిగాయి. నివేదికను శాసనసభలో చర్చించినప్పటికీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కొద్దిరోజుల క్రితం కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ని వేదికపై చర్యలు తీసుకున్నారా? తీసుకోబోతున్నారా? నిర్ణయం పెండింగ్‌లో ఉందా? చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ జారీచేసిన జీవో, సీబీఐ ఎంట్రీపై నిషేధం ఎత్తివేతకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ధర్మాసనానికి అందజేశారు. కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారంగా సీబీఐ దర్యాప్తును కోరలేదని, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ తదితర నివేదికల ఆధారంగా కోరామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ దర్యాప్తు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తాము విచారిస్తున్నది పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన అంశమని, పిటిషనర్లు కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారని ప్రస్తావించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం వేరే విషయమని, కావాలంటే దాన్ని సవాల్ చేస్తూ విడిగా పిటిషన్లు వేసుకోవచ్చని సూచించింది. కమిషన్ నివేదికలోని అంశాలను ఆధారంగా చేసుకొని పిటిషనర్లపై వచ్చే విచారణ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కౌంటర్ల కోసం తదుపరి విచారణ అక్టోబరు 7కు వాయిదా వేసింది.