హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః మద్యం అమ్మకాల్లో గతేడాది తెలంగాణ రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ.40వేల కోట్లకు పైగా మద్యాన్ని మందుబాబులు తాగేశారు.దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయంలో సరికొత్త రికార్డును అందుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి రూ.40 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి కాగా ఇందులో బీర్ల అమ్మకాలు తగ్గగా లిక్కర్ సేల్స్ మాత్రం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వైన్స్‌లు, బార్ల టెండర్ల ద్వారా కూడా భారీగానే ఖజానాకు ఆదాయం సమకూరింది.
డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.5,051 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.తెలంగాణలో మద్యం ఆదాయం ఏటికేడాది సరికొత్త రికార్డులను అధిగమిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్క ఏడాదిలోనే ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.44 వేల కోట్ల మార్కు దాటడం గమనార్హం. ఈ ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో ఏకంగా రూ.40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో 2,620 ఏ-4 మద్యం దుకాణాలకు అప్లికేషన్ల రూపంలోనే ఆబ్కారీ శాఖకు రూ.2,869 కోట్లు వచ్చాయి. ఇక మద్యం దుకాణాల రెంటల్ ఫీజుల ద్వారా మరో రూ.1,771 కోట్లు రాగా, 1,214 బార్ల ద్వారా ఇంకో రూ.549 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. దీంతో 2025-26 ఆర్థిక ఏడాదిలో ఎక్సైజ్ శాఖ ఖజానాకు మొత్తంగా రూ.44,557 కోట్లు ఆదాయం సమకూరింది. మరోవైపు గతేడాది కంటే ఈసారి మద్యం విక్రయాలు రూ.2,700 కోట్లకు పైగా అధికంగా జరిగాయి.మొత్తంగా గతేడాదిలో 7 శాతం లిక్కర్ సేల్స్ పెరిగినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇందులో మొత్తంగా 382.91 లక్షల కేస్ల లిక్కర్, 387.34 లక్షల కేస్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇక అత్యధికంగా డిసెంబరు నెలలో రూ.5,051 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరగ్గా అత్యల్పంగా అక్టోబరు నెలలో రూ.2,709 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి.
గతంలో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయంటే…
ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2024-25తో పోల్చితే రాష్ట్రంలో బీర్ల అమ్మకాల్లో 9 శాతం తగ్గుదల నమోదైంది. అదే సమయంలో లిక్కర్ అమ్మకాలు మాత్రం భారీగా పెరిగాయి.2018-19లో రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.20,859 కోట్ల ఆదాయం రాగా. అది 2025-26 ఆర్థిక ఏడాది నాటికి రూ.44 వేల కోట్లు దాటడం గమనార్హం. 2024-25 ఏడాదిలో మొత్తంగా రూ.37,487 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా అది ఈ ఏడాది మరింత పెరిగింది.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12,706 కోట్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరగ్గా.. 2025-26 వచ్చే సరికి రూ.40 వేల కోట్లు దాటాయి. అంటే మద్యంపై వచ్చే ఆదాయం సుమారు 3 రెట్లు పెరిగింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు.. డిసెంబర్ 31 కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో 2025 డిసెంబరు నెలలో మద్యం ఏరులై పారి.. అత్యధిక ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
