తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం సర్వే చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న జనాల దగ్గరకు వెళ్లి సర్వే చేసి అర్హుల జాబితా తయారు చేస్తున్నారు అధికారులు. అయితే సర్వే ఎలా చేస్తున్నారన్న దానిపై గందరగోళం నెలకొంది. అధికారుల దగ్గర సరైన సమాచారం లేకపోవడంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూతూమంత్రంగా సర్వే చేసి కొందరికే రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రాజ్యంగ దినోత్సవం రోజు ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను మోసం చేయలని ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గ్రామాల్లో జరగాల్సిన రేషన్ కార్డు సెలక్షన్.. కులగణన సర్వే ఆధారంగా లిస్ట్ తీసి గ్రామాలకు పంపారని..కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడి పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రేషన్ కార్డు కావాలని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నారు, గతంలో ప్రజాపాలనలో 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు, వాటిని కాదని.. కులగణన సర్వేని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని హరీష్ రావు నిలదీశారు. కనీసం ప్రజాపాలన అప్లికేషన్స్ ఆన్‌లైన్ చేయకుండా వాటిని చెత్త బుట్టలపాలు చేశారు..
ప్రజాపాలన దరఖాస్తులను, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న దరఖాస్తులును ఎందుకు పరిశీలించడం లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందని హరీష్ రావు అన్నారు. ఒక గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకుంటే 40 మంది పేర్లు మాత్రమే అర్హులుగా వచ్చాయని..ఇదేంటని అధికారులను అడిగితే హైదరాబాద్ నుండి మాకు ఈ పేర్లు ఇచ్చారు అని అధికారులు చెబుతున్నారని హరీష్ రావు చెప్పారు.