
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తెరలేపుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆమె.. ఆ దిశగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణ జాగృతిని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియను ప్రారంభించిన కవిత, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గోప్యంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా గుర్తించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. కవిత తరఫున ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి ఈసీఐ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తైతే మరో మూడు నెలల్లో పార్టీకి అధికారిక గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
పార్టీ గుర్తింపు లభిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ బరిలోకి దిగే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పరీక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలన్నది కవిత ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరాలని ఆమె ఇటీవల బహిరంగంగా పిలుపునిచ్చారు. ఉద్యమ నేపథ్యం ఉన్నవారితో పార్టీని నిర్మించాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం.
పార్టీ పేరు, గుర్తు, అంతర్గత విధివిధానాలపై కూడా కవిత ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కొత్త పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఉగాది పండుగ నాటికి ఈ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముందని అంటున్నారు.
కొత్త పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలపై కవిత ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి తన రాజకీయ అజెండాలో ప్రధానంగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తన పార్టీ ఎదుగుతుందని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతా సాధికారతకు పెద్దపీట వేస్తామని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని ఇప్పటికే వెల్లడించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణపై మరిన్ని ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





