తెలంగాణరాజకీయం

శివన్నగూడెం ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు..!

తమ సమస్యలను పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం

క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: నల్గొండ జిల్లా,మర్రిగూడ మండలము, శివన్నగూడెం ప్రాజెక్ట్ పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులు మంగళవారం అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ…. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించే ముందు తమకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు.

ముంపు పరిధిలో ఉన్న తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వస్తున్నా, ఇప్పటివరకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్ అండ్ ఆర్)కు సంబంధించిన స్పష్టమైన హామీలు ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమకు ప్రత్యామ్నాయంగా నివాస ప్లాట్లు కేటాయించాలని, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, నిరాశ్రయులుగా మారుతున్న తమ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రాజెక్ట్ పనులు చేపట్టడం అన్యాయమని తెలిపారు.  మా జీవనాధారం, భూములు, ఇళ్లు అన్నీ ఈ గ్రామంతో ముడిపడి ఉన్నాయి. న్యాయం చేయకుండా ఊరు ఖాళీ చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఉన్నతాధికారులు, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.

ఈ ఆందోళనలో వెంకటేష్, ఏషోపు, హరికృష్ణ, బోయపల్లి రేణుక, రజితతో పాటు పలువురు ముంపు గ్రామస్థులు పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి, ప్రాజెక్టు ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు. గ్రామస్తుల డిమాండ్లపై అధికారికంగా స్పందన రావాల్సి ఉందని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button