సన్నాహాలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
మెగాస్టార్ చిరంజీవి వినతిపై సానుకూల నిర్ణయం
విశాఖ వేదికగా ప్రదానం
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో : ఏపీలో నంది అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రధానోత్సవం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెగాస్టార్ వ్యాఖ్యలు చేశారంటూ ఎక్కువమంది ఆయన తీరును తప్పుపట్టారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా తీసుకుంది. అందుకే త్వరలో నంది అవార్డులను అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఒక జ్యూరీ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. టెలివిజన్, సినీ రంగాలకు చెందిన వ్యక్తులకు నంది అవార్డులను ప్రదానం చేయనున్నారు.
గద్దర్ అవార్డుల ప్రదానం
తెలంగాణలో గద్దర్ అవార్డుల పేరిట ప్రదానోత్సవం పూర్తయింది. ఇదే వేదికపై చిరంజీవి తో పాటు ఆర్.నారాయణమూర్తి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలని కోరారు. అయితే చిరంజీవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వచ్చాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. చిరంజీవి విన్నపాన్ని సానుకూలంగా తీసుకుంది. అందుకే నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి 2017లో టిడిపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కు సంబంధించి నంది అవార్డులను ప్రకటించింది. కానీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు. ఐదు సంవత్సరాల పాటు నంది అవార్డుల జోలికి పోలేదు.
ఆ విమర్శలు రాకూడదని..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నంది అవార్డుల ప్రస్తావన వచ్చింది. కానీ చిత్ర పరిశ్రమకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆపై హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఎమ్మెల్సీగా నాగబాబు కొనసాగుతున్నారు. 2017లో టిడిపి ప్రభుత్వం నంది అవార్డులను ప్రధానం చేస్తే చిత్ర పరిశ్రమ వ్యక్తులు చాలామంది విమర్శలు చేశారు. తమ వారికే అవార్డులు ఇచ్చుకున్నారని విమర్శించారు. మరోసారి ఆ పరిస్థితి రాకూడదని భావించి నంది అవార్డుల జోలికి వెళ్లలేదు ఏపీ ప్రభుత్వం. అయితే సినీ పరిశ్రమ పెద్దల నుంచి విజ్ఞప్తి రావడంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నంది అవార్డుల ప్రదానానికి సిద్ధమయింది.
విశాఖ నుంచి ఇవ్వాలని..
విశాఖ వేదికగా నంది అవార్డులను అందించే అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే విజయవాడ కంటే విశాఖలో సినిమా షూటింగ్లకు అనుకూలం. అందుకే విశాఖలో నంది అవార్డులు ఇవ్వడం ద్వారా సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఇక్కడ నుంచి షూటింగులు జరిగేలా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీ నాగబాబును సంప్రదించి జ్యూరీ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
