
నెల్లికల్ చెంచు వాని తండాలో సమస్యలు, పథకాల అమలు పర్యవేక్షణ
మిర్యాలగూడ క్రైమ్ మిర్రర్, నవంబర్ 21: నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెంచు వాని తండా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టేందుకు శుక్రవారం ఉదయం నెల్లికల్ చెంచు వాని తండాను సందర్శించారు. ఉదయం 7 గంటలకే తండాకు చేరుకున్న కలెక్టర్‌తో పాటు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తమ వద్దకే అధికారులు వచ్చారని చెంచు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.ప్రజావాణిలో నెల్లికల్‌కు చెందిన ఆదెమ్మ ఇచ్చిన పిటీషన్‌ను పరిశీలించిన కలెక్టర్..ఆధార్, రేషన్ కార్డు, జాబ్ కార్డు వంటి కీలక ధ్రువపత్రాలు లేక చెంచులు ప్రభుత్వ పథకాల నుంచి దూరమవుతున్నారని గుర్తించారు. సమస్యను సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్, చెంచులు జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి లేకుండా తానే తండాకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు.
తండా వాసులు ఈ సందర్భంగా చెప్పిన సమస్యలు,కొంతమందికి ఆధార్ కార్డులు లేకపోవడం,ఉన్న ఆధార్‌లో అప్డేషన్ లేనందున పథకాలు రాకపోవడం,తాగునీటి బోరు మరమ్మత్తు,రేషన్ కార్డులు పెండింగ్, ఉపాధి హామీ జాబ్ కార్డులు లేవు ,స్థానికుల నుంచే ఆశ, అంగన్వాడి, ఏఎన్ఎంలను నియమించాలి, నెట్‌వర్క్ సమస్యల వల్ల అత్యవసర సమాచారం ఇవ్వలేకపోవడం,కలెక్టర్ వెంటనే రంగంలోకి దిగి డిఆర్డిఓ, గృహనిర్మాణ, వైద్యారోగ్య, పశుసంవర్ధక, అటవీ శాఖ అధికారులను తండాలోనే శిబిరం ఏర్పాటు చేసి వివిధ పథకాలను ప్రజలకు వివరింపజేశారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..ప్రతి చెంచు కుటుంబం పథకాల ప్రయోజనం పొందాలంటే సరైన ధ్రువపత్రాలు తప్పనిసరి. ఆధార్ అనుసంధానం కీలకం. ఆధార్ లేనివారికి కొత్త కార్డులు, తప్పులున్నవారికి సవరణలు వెంటనే చేస్తాం అని తెలిపారు.పెన్షన్లు మూడు నెలలకు మించి తీసుకోకుండా ఉండాలని, భూమిని వదిలేయకుండా సాగు చేయాలని, అటవీ భూములపై కొత్త సాగు మొదలుపెట్టొద్దని సూచించారు.
చెంచు వాని తండాలో శాశ్వత ఆశ, అంగన్వాడి, నెట్వర్క్ సౌకర్యం, గ్రామపంచాయతి భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. శాసనసభ్యులు జయవీర్ రెడ్డి మాట్లాడుతూ..తండాలోని తాగునీటి బోర్ మోటర్ సహా అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.

తండా కోసం ప్రభుత్వం అందించే పథకాలు ఎవరూ కోల్పోకుండా చూడాలని సూచించారు.తీరుమలగిరి..సాగర్ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ మాట్లాడుతూ ఆధార్, మీసేవ సంబంధిత సేవలను తండాలోనే అందించేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా.. 93 మంది గృహస్థులకు వివిధ ధ్రువపత్రాలు మంజూరు, 72 మందికి ఆధార్ అప్డేషన్ మరియు కొత్త కార్డులు శుక్రవారమే అందించినట్లు కలెక్టర్ వెల్లడించారు.జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆధార్..మీసేవ..ఇతర సేవల శిబిరాన్ని ప్రారంభించారు. డివిజన్, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





