
Murder: దీపాలతో మెరిసే మండపం, పూల పరిమళాలతో అలంకరించిన ఇంటి ఆవరణ, నవ వధువు కోసం సిద్ధమవుతున్న ఆ ఆనందకర వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. జీవితాన్ని కొత్త అధ్యాయంతో ప్రారంభించాలనుకున్న ఆ యువతి, పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన సమయంలో శవంగా మారిపోవడం ఇరు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టింది. పెళ్లికూతురిగా ముస్తాబవుతున్న తరుణంలోనే ఆమె ఊహించని మరణం చీకటిని తెచ్చింది. ఆమెను చేతిలో పట్టుకుని జీవితం సాగిస్తానని మాటిచ్చిన ప్రియుడే చివరికి కాలయముడిలా మారి ఆమె ప్రాణాలను హరించేయడం అందరినీ కుదిపేసింది.
ఏడాదిన్నరగా సహజీవనం సాగించిన ఈ జంట మధ్య పెళ్లి ముందు చిన్నపాటి తగాదా మొదలై కట్నం వివాదానికి దారి తీసింది. తన ప్రేమికురాలిని పెళ్లి చేసుకుని జీవితాంతం చూసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు.. పెళ్లి ముహూర్తానికి గంట ముందు తన మనసులోని సైకో రూపాన్ని బయటపెట్టాడు. ఆమె నుంచి డబ్బు ఆశించిన అతను, ఆ కోరిక నెరవేరకపోవడంతో తమ మధ్య ప్రేమతో నిర్మించిన బంధాన్ని క్రూరంగా చిదిమేశాడు. ఆమె నుదిటిపై తిలకం పెట్టాల్సిన వాడే చివరికి ఆమె రక్తంతో తన చేతులను నింపుకున్నాడు. ప్రేమగా పిలిచిన వాడే ప్రాణం తీశాడన్న నిజం కుటుంబాలను, ప్రాంతాన్ని, చూసిన వారిని షాక్‌కు గురిచేసింది.
గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సజ్జన్ బారైయా, సోని హిమ్మత్‌లు ప్రేమించుకుని ఏడాదిన్నర నుంచి లివింగ్ రిలేషన్‌లో జీవిస్తున్నారు. ఇరు కుటుంబాల అంగీకారం లేకున్నా ప్రేమతో జీవితం తీర్చిదిద్దుకుంటామని నిర్ణయించుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకుని అధికారికంగా ఒక్కటవుదామని నిర్ణయించుకున్నారు. పెళ్లి శుభలేఖలు పంచి, వేడుకకు ఏర్పాట్లు చేసి, ఆనందంతో తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజు కోసం ఎదురుచూశారు. అయితే శనివారం రాత్రి జరగాల్సిన పెళ్లే ఆ యువతికి కాలరాత్రిగా మారింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆమె శరీరం చివరికి శవపెట్టెలో పడటం ఈ సంఘటనను మరింత హృదయవిదారకంగా మార్చింది.
ALSO READ: మగ పిల్లలను చదివించినట్లు.. ఆడపిల్లలను చదివించట్లేదు : కవిత





