Tuesday, March 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్తీవ్ర అసంతృప్తితో ముద్రగడ...!

తీవ్ర అసంతృప్తితో ముద్రగడ…!

  • జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం

  • గోదావరి జిల్లాల బాధ్యతలను అడిగిన పద్మనాభం

  • తిరస్కరించిన వైసీపీ అధినేత

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం అసంతృప్తితో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహంతో రగిలిపోతున్నారా? వైసీపీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని ఆయన సహించుకోలేకపోతున్నారా? తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం వైసీపీలో తనకు ప్రాధాన్యం కోరుకుంటున్నారు. ఒక పదవి ఇవ్వాలని జగన్ వద్ద ప్రతిపాదన పెట్టారు. కానీ అందుకు జగన్ అంగీకరించలేదని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది..

ఎన్నికలకు ముందు వైసీపీలోకి..
మొన్నటి ఎన్నికలకు ముందు కుమారుడితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని కూడా శపధం చేశారు. అక్కడ ఓడించలేక తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఓ నియోజకవర్గ ఇన్చార్జిగా ముద్రగడ కుమారుడు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం సైతం తెరవెనుక వ్యూహాలు రూపొందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముద్రగడను వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నారు. కానీ ఆ పదవికి ఎటువంటి బాధ్యతలు లేవు. అందుకే బాధ్యతయుతంగా ఉండే గోదావరి జిల్లాల బాధ్యతలను తనకు ఇవ్వాలని ముద్రగడ జగన్మోహన్ రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన ఎప్పుడూ పాతతరం రాజకీయాలనే చేస్తుంటారని జగన్ గుర్తించారు. అందుకే గోదావరి జిల్లాల బాధ్యతలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ముద్రగడ కోపంతో రగిలిపోతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది.

సీనియర్ మోస్ట్ లీడర్..
1978లో రాజకీయాల్లోకి వచ్చారు ముద్రగడ. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డి సైతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ ఇద్దరు నేతలతో ముద్రగడ పనిచేశారు. కానీ ముద్రగడకు స్థిరత్వం తక్కువ. తరచూ పార్టీలు మారుతారు. నేతలతో విభేదిస్తుంటారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న చాలామంది నేతలతో ముద్రగడకు పడడం లేదట. అటువంటి నేతకు గోదావరి జిల్లాల బాధ్యతలు ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గుర్తించారట. అందుకే గోదావరి జిల్లాల బాధ్యతలు ఇవ్వడం కుదరదు అని తేల్చేసారట. అప్పటినుంచి ముద్రగడ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నారట. ఇప్పటికే వయోభారంతో బాధపడుతున్నారు ముద్రగడ. ఈ సమయంలో ఆయనకు పెద్ద పదవులు ఎందుకన్న ప్రశ్న వస్తుంది. ఆయనకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వద్దని కొంతమంది వైసీపీ కాపు నేతలు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారట. ఈ పరిస్థితులు చూస్తుంటే ముద్రగడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఉండరా? అనే బలమైన చర్చ మాత్రం నడుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments