14 ఏళ్ల బాలికను 54 ఏళ్ల వ్యక్తికి అమ్మేసిన తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన సభ్యసమాజాన్ని షాక్‌కు గురిచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన సభ్యసమాజాన్ని షాక్‌కు గురిచేసింది. పుంగనూరులోని బీడీ కాలనీలో కన్నతల్లి తన మైనర్ కూతురునే డబ్బుల కోసం అమ్మకానికి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల ఒప్పందంతో 14 ఏళ్ల బాలికను 54 ఏళ్ల వ్యక్తికి రెండో పెళ్లి పేరుతో అప్పగించిన ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తల్లి పాత్ర, మధ్యవర్తి మోసం, మైనర్‌పై జరిగిన హింస అన్నీ కలిసి ఈ ఘటనను మరింత భయంకరంగా మార్చాయి.

పుంగనూరులోని బీడీ కాలనీకి చెందిన రామరాజు- శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు నెలల క్రితం భర్తతో గొడవపడి శోభ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. పుంగనూరులోని టిడ్కో ఇళ్లలో నివసిస్తూ, రెడ్డెప్ప అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో పెద్ద కూతుర్ని చదువు పేరుతో పిలిపించుకుని, ఆమెను అమ్మేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. కర్ణాటక రాయల్పాడుకు చెందిన రెడ్డి రాజశేఖర్ రెండో పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న మధ్యవర్తి రెడ్డెప్ప, తల్లి శోభతో బేరసారాలు చేసి రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఒప్పందం ప్రకారం రూ.50 వేల అడ్వాన్స్‌గా తీసుకున్న శోభ.. బెంగళూరులో మైనర్ బాలికకు రాజశేఖర్‌తో పెళ్లి జరిపించింది. అనంతరం బాలికను తన వెంట తీసుకెళ్లిన రాజశేఖర్, ఆమెను చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. వేధింపులు తట్టుకోలేకపోయిన బాలిక, చిన్నాన్నకు ఫోన్ చేసి విషయాన్ని వెల్లడించింది. అతని సహాయంతో పుంగనూరుకు చేరుకున్న బాలిక, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటన కర్ణాటకలో జరిగిందన్న కారణంతో పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేయకుండా, బాలికను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి సంరక్షణ చర్యలు చేపట్టారు.

ఈ వ్యవహారం బయటపడటంతో జిల్లా యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. ఐసీడీఎస్ సిబ్బందితో విచారణ చేపట్టి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక చదువుకోవాలన్న కోరికను గౌరవిస్తూ, ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. మరోవైపు తల్లి శోభ విచారణలో డబ్బులు తీసుకోలేదని చెప్పినా.. మధ్యవర్తి రెడ్డెప్ప తనను మోసం చేశాడని ఆరోపిస్తోంది. తెలిసో తెలియకో తప్పు చేశానని అంగీకరిస్తూనే, కూతురి భవిష్యత్తు కోసం అధికారులే చదివిస్తామని చెప్పారని ఆమె వాదిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ: రేపటి నుంచి RRB రైల్వే ఆన్‌లైన్ పరీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button