ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

ఇన్‌స్టాగ్రామ్‌లో అబ్బాయితో పరిచయం.. అర్ధరాత్రి ఊహించని పనిచేసిన బాలిక

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు మైనర్ల జీవితాలపై చూపుతున్న ప్రభావం ఎంత ప్రమాదకరంగా మారుతుందో విజయవాడ ప్రసాదంపాడు పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు మైనర్ల జీవితాలపై చూపుతున్న ప్రభావం ఎంత ప్రమాదకరంగా మారుతుందో విజయవాడ ప్రసాదంపాడు పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ మైనర్ బాలుడి కోసం, కుటుంబాన్ని కాదని ఓ 16 ఏళ్ల బాలిక అర్థరాత్రి వేళ ఇంటిని వదిలి వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. చదువు, భవిష్యత్ అన్నీ పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు పిల్లలను ఎటువంటి దారుల్లోకి నడిపిస్తున్నాయో ఈ సంఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది.

విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన ఓ బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పామర్రు నియోజకవర్గంలోని కూచిపూడికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత సుదీర్ఘ చాటింగ్‌గా మారింది. కుమార్తె ఫోన్‌లో గంటల తరబడి చాటింగ్ చేయడాన్ని గమనించిన తల్లి.. ఆమెను హెచ్చరించి మందలించింది. అయినప్పటికీ బాలిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఈ నెల 21న బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పిన ఆమె, ఎవరికి తెలియకుండా రాత్రి వేళ బస్సు ఎక్కింది. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా కూచిపూడిలో ఉన్న ఆ మైనర్ బాలుడి ఇంటికి చేరుకుంది. అర్థరాత్రి బాలిక అక్కడికి చేరుకోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు కూడా షాక్‌కు గురయ్యారు. బాలికను తిరిగి ఇంటికి పంపించేందుకు వారు ప్రయత్నించినప్పటికీ, ఆమె మాత్రం తీవ్రంగా నిరాకరించింది.

మరుసటి రోజు బాలిక ఇంటికి రాకపోవడం, ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ కావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పటమట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా టెక్నికల్ విశ్లేషణ చేసి, ఆమె కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా అక్కడికి చేరుకున్నారు.

ఇదే సమయంలో బాలుడి తల్లిదండ్రులు కూడా పరిస్థితి తీవ్రతను గ్రహించారు. బాలికను బలవంతంగా వెనక్కి పంపితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని భావించి, ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. వెనక్కి పంపితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక బెదిరించడంతో, పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. చివరకు ఎంతో కష్టపడి ఆమెను ఒప్పించి విజయవాడకు తీసుకువస్తుండగా, మార్గమధ్యలో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు బాలికను, ఆమె తల్లిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్ వయసులో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారుతాయో బాలికకు వివరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై మరింత నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఘటనతో సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది.

ALSO READ: మటన్‌లోని ఈ పార్ట్ తింటే ఇన్ని లాభాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button