Joint Income Tax Filing: వివాహమైన జంటలకు ఆదాయ పన్ను నుంచి ఉపశమనం కల్పించేలా ఉమ్మడిగా ఐటీ రిటర్నులు దాఖలు చేసే అవకాశం కల్పించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాతోపాటు పలు సంస్థలు, వ్యక్తులు ఈ అవకాశం కోసం కేంద్రానికి ప్రతిపాదనలను సమర్పించాయి.
పెళ్లైన జంటలకు గుడ్ న్యూస్
సాధారణంగా వ్యక్తిగత ఆదాయంలో ఇన్సూరెన్స్, ఇంటి అద్దె, పిల్లల చదువుల ఖర్చులు వంటి వాటికి నిర్ణీత పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. దంపతులలో ఎవరు ఈ ఖర్చును భరించినా వారి వ్యక్తిగత ఐటీ రిటర్నులలో మాత్రమే చూపించుకోవడానికి వీలుంది. ఒకవేళ దంపతులలో ఒకరే సంపాదిస్తున్నా.. భార్యాభర్తల సంపాదనలో ఎక్కువగా తేడాలున్నా.. మినహాయింపులను పూర్తిగా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ, ఉమ్మడిగా ఐటీ రిటర్నులు దాఖలు చేసే అవకాశం కల్పిస్తే.. మినహాయింపులను పూర్తిగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. దీనితో కట్టాల్సిన పన్ను మొత్తం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. దానికితోడు దంపతులు ఇంటికోసం, ఇతర అవసరాల కోసం ఉమ్మడిగా రుణాలు తీసుకోవడం మరింత సులువు అవుతుంది.
విదేశాల్లోనూ ఈ పద్దతి అమలు
అమెరికా, జర్మనీ తదితర దేశాల్లో దంపతులు ఉమ్మడిగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఇప్పటికే ఉంది. కేంద్రం తాజా బడ్జెట్‌లో దీనిని చేరిస్తే.. ఆదాయ పన్ను వ్యవస్థలో కీలక మార్పుకానుంది. దంపతుల ఉమ్మడి ఆదాయంలో రూ.8 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించవద్దని, రూ.8-16 లక్షల మధ్య 5శాతం, రూ.16-24లక్షల మధ్య 10శాతం, రూ.24-32 లక్షల మధ్య 15శాతం, రూ.32-40 లక్షల మధ్య 20శాతం, రూ.40-48లక్షల మధ్య 25శాతం, రూ.48లక్షలపైన 30శాతం పన్ను విధించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది.





