
Manchu Lakshmi: పదిహేనేళ్ల వయసులో తన జీవితాన్ని బాగా కలిచిమేసిన ఒక చేదు అనుభవం ఉందని నటి మంచు లక్ష్మి ఇటీవల వెల్లడించింది. బయటకు ఎప్పుడూ ధైర్యంగా కనిపించే ఆమె మనసులో ఇంత బాధ దాగి ఉందని చాలా మంది ఊహించలేదు. హాటర్‌ఫ్లైకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ చాలా భావోద్వేగంతో మాట్లాడింది. ఆ సమయంలో తాను పదో తరగతి చదువుతున్నానని, రోజూ స్కూలుకు కారులోనే వెళ్లేదానినని, తన వెంట తల్లి, డ్రైవర్, బాడీగార్డ్ ఎప్పుడూ ఉంటారని చెప్పింది. చిన్నప్పటి నుంచి రక్షణలోనే పెరిగిన ఆమెకు వాహనాలే అలవాటు కావడంతో సాధారణ బస్ ప్రయాణం చేయడం కూడా ఓ కొత్త అనుభవమే.
ఒకసారి స్కూల్ హాల్ టికెట్లు తీసుకోవడానికి టీచర్లు వారిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకెళ్లారని చెప్పింది. సాధారణ ప్రయాణం చేయబోతున్నానన్న ఆనందంతో తాను ఎంతో ఎగ్జయిట్ అయ్యానని, అది మంచి అనుభవమవుతుందని భావించినట్టుగా చెప్పింది. కానీ ఆ ప్రయాణమే ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాల పాటు మర్చిపోలేని క్షణంగా మారింది. బస్సులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, ఆ షాక్ నుండి వెంటనే కోలుకోలేకపోయానని చెప్పింది. తాను చిన్నపిల్లనని అతనికి తెలుసా లేదా అన్నది కూడా అర్థం కాలేదని, అలాంటి దుర్మార్గపు ప్రవర్తన తనకు తీవ్ర అసహ్యాన్ని కలిగించిందని గుర్తుచేసుకుంది.
వెంటనే గొడవ పెట్టుకునే ధైర్యం రాలేదని, భయంతో పక్కకు తప్పుకోడం తప్ప ఇంకేం చేయలేకపోయానని చెప్పింది. ఆ తరువాత జరిగినదాన్ని తన స్నేహితులకు చెప్పగానే వారు కూడా ఇలాంటి వేధింపులు తరచూ ఎదుర్కొంటున్నామని చెప్పడం తనను మరింత కుంగదీసిందని మంచు లక్ష్మి వెల్లడించింది. ‘‘నేను మోహన్‌బాబు కూతుర్ని కాబట్టి ఈ ప్రపంచం నన్ను ప్రత్యేకంగా కాపాడుతుందని అనుకున్నాను. కానీ నిజానికి అసలు ప్రపంచం ఎవ్వరినీ విడిచిపెట్టదు’’ అని చెప్పింది. ఇలాంటి అనుభవాలు చాలా మందికి జరుగుతాయని, కానీ బయటకు అంగీకరించడానికి చాలా మంది సంకోచిస్తారని ఆమె పేర్కొంది.





