జాతీయంవైరల్

కాళ్లతో తొక్కుతూ స్వీట్ తయారీ!.. చూస్తే మాత్రం తినలేంరా బాబు (VIDEO)

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. నార్త్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన స్వీట్ అయిన ఫినీని అత్యంత అనారోగ్యకరమైన విధానంలో తయారు చేస్తున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కార్మికులు ఫినీ మిశ్రమాన్ని చేతులతో కాకుండా నేరుగా కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తుండటం స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాంప్రదాయ వంటకం పేరిట ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆహార భద్రత, పరిశుభ్రతపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వైరల్ వీడియో విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సంబంధిత యూనిట్‌పై తనిఖీలు చేపట్టి పరిస్థితిని పరిశీలించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో ఫినీ నిల్వలు గుర్తించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

తనిఖీల అనంతరం సుమారు 110 కేజీల ఫినీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా భావించి వెంటనే సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత స్వీట్ యూనిట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

ఫినీ అనేది రాజస్థాన్‌కు చెందిన సంప్రదాయ మిఠాయి. మైదా, నెయ్యి, పంచదార లేదా బెల్లంతో దీన్ని తయారు చేస్తారు. రూపంలో ఇది కారప్పూస లేదా తాడిపప్పు ఆకారంలో కనిపిస్తుంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో ఫినీకి మంచి డిమాండ్ ఉంటుంది. రుచితో పాటు సంప్రదాయ గుర్తింపుగా భావించే ఈ స్వీట్ విషయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికులను మరింత కలచివేసింది.

సంప్రదాయ పేరుతో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం తగదని, ఇలాంటి యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో, ఇతర ప్రాంతాల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసే అవకాశముందని తెలుస్తోంది.

ALSO READ: Faria Abdullah: అవును.. ప్రేమలో ఉన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button